కోదండ‌రాం ఎంత హ‌ర్ట‌య్యాడో చూడండి

కోదండ‌రాం ఎంత హ‌ర్ట‌య్యాడో చూడండి

స్వ‌రాష్ట్ర సాధ‌న‌లో భాగంగా క‌లిసి ప‌నిచేసిన వ్య‌క్తులంతా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నారు. ఇదే విష‌యాన్ని ఏకంగా మీడియా ముఖంగా ఆయ‌న వెల్ల‌డించారు. సంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి, పంటల స్థితిగతులను పరిశీలించిన సంద‌ర్భంగా కోదండ‌రాం మీడియాతో మాట్లాడుతూ తనపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం మానవతా దృక్పథంతో పనిచేస్తున్న తన వెనక ఎవరూ లేరని, రైతు ప్రయోజనాలే ఉన్నాయని స్ప‌ష్టం చేశారు. తాము చెప్పేవాటిలో మంచి-చెడులను గమనించాలని, వాస్తవాలను గుర్తించి ప్రజలకు మేలు చేయాలని కోదండ‌రాం కోరారు. తమలో ఏదైనా తెలియని తప్పు ఉంటే వెల్లడించాలని, సరిదిద్దుకునేందుకు సిద్ధమని వివ‌రించారు. రాజకీయ చర్చలకు వేదిక కాకుండా, మాటలతో దాడులకు పాల్పడడం, దుమ్మెత్తిపోయడం వంటి పద్ధతులను మార్చుకోవాలని ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం పంచుకునే వారికి కోదండ రాం హితవు పలికారు.

స్వరాష్ట్రం సాధించినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగడం దురదృష్టకరమని కోదండ‌రాం అన్నారు. వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే అందరికీ ప్రయోజనంగా ఉంటుందని అదే విష‌యాన్ని తాను రాష్ట్ర ప్ర‌భుత్వానికి విన్న‌విస్తే విమర్శ‌లు చేస్తున్నార‌ని కోదండ‌రాం వాపోయారు.  రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు సాగు చేసిన పంటలన్నీ చిన్నాభిన్నంగా మారాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలకు పెను శాపంగా మారిందని కోదండ‌రాం  ఆవేదన వ్యక్తం చేసారు. పంట నష్టపరిహారాన్ని వెంటనే అందించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలతో సమస్యలకు పరిష్కారం లభించదని సూచించారు. సింగూర్ ప్రాజెక్టులోకి వచ్చిన వరద నీటిని నిలిపివేయడం వల్ల ఎగువన రైతులు సాగు చేసిన పంటలు నీట మునిగాయని కోదండ రాం పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు ఆలోచించివుంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. సింగూర్ ప్రాజెక్టులోని నీటిని ఈ ప్రాంతానికి చెందిన రైతులకు సాగుకు, ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు