ఆలోచన రేకెత్తిస్తున్న కొండా సురేఖ

ఆలోచన రేకెత్తిస్తున్న కొండా సురేఖ

వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేసిన ఏడురోజుల నిరాహార దీక్ష మీద ఇప్పటికీ ఆయనంటే గిట్టని వారిలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. జగన్మోహనరెడ్డి తొలి అయిదు రోజుల పాటూ జైల్లో అసలు నిరాహార దీక్ష చేశారో ఆపద్ధర్మంగా.. ఏమైనా తీసుకున్నారో లేదో ఎవ్వరికీ తెలియని సంగతి. కేవలం జైలు అధికారులు చెప్పేదాన్ని బట్టి ప్రజలు నమ్మాల్సిందే తప్ప.. అదేమీ అందరి ఎదుట బహిరంగంగా జరిగిన దీక్ష కాదు. అదే సమయంలో జైలు అధికారులు ఎన్ని రకాలుగా జగన్‌తో లాలూచీ పడి ఆయనకు అనేక విధాలుగా సహకరిస్తూ వస్తున్నారనే విషయంలో ఇప్పటికే రకరకాల ఆరోపణలున్నాయి. పరిమితి మించిన, మరియు అనధికార ములాఖత్‌లు, మొబైల్‌ అక్రమ వెసులుబాటు వంటి ఆరోపణలు బోలెడు ఉన్నాయి. అలాంటి జైలు అధికారులు జగన్‌కు ఆహారం తీసుకున్నా సరే.. బాహ్య ప్రపంచానికి ‘లేదని’ చెప్పడానికి పెద్దగా శ్రమ అక్కర్లేదు. పైగా అయిదోరోజు అర్ధరాత్రి దాటాక ఆస్పత్రికి తరలించినప్పుడు జగన్‌ స్వయంగా చలాకీగా నడుచుకుంటూ వెళ్లడం కూడా కొన్ని అనుమానాలకు బీజం వేసింది. అయిదురోజులు నిరాహారంగా ఉంటే ఈ మాత్రం సత్తువ ఒంట్లో మిగులుతుందా అని కొందరి అనుమానం.

ఇప్పుడు అలాంటి అనుమానాలకు మరింత దన్నుగా నిలుస్తూ.. కొండా సురేఖ కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు. జగన్‌ నిరాహార దీక్ష ఒక పెద్దడ్రామా అంటూ సురేఖ విమర్శిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రాణాధారమైన, విటమిన్‌ టాబ్లెట్లను వేసుకుంటూ.. పైకి మాత్రం నిరాహార దీక్ష అంటూ బిల్డప్‌ ఇచ్చారని సురేఖ చెబుతున్నారు. సురేఖ అంటే.. ఇవాళ వైకాపాతో తెలంగాణ విషయంలో విభేదించి బయటకు వచ్చినప్పటికీ.. నిన్నటిదాకా వారితో అంటకాగిన ప్రధాన నాయకుల్లో ఒకరు. నిన్నటిదాకా జగనన్న గురించి కీర్తించిన ఆమె ఇవాళ సంధిస్తున్న  ప్రశ్నలు ప్రజల్లో కూడా ఆలోచన కలిగిస్తున్నాయి.

జగన్‌ దీక్షను ఎంత వరకు నమ్మవచ్చుననే అనుమానం ఇప్పుడు ఊపందుకుంటోంది. ఆయన కేవలం తనకు, తన పార్టీకి పాజిటివ్‌ మైలేజీ సృష్టించుకోవడానికే ఆమరణ దీక్షా ప్రహసనం నడిపించాడని జైలు అధికారుల సహకారం... పుష్కలంగా ఉండడంతో ఆ దీక్ష ఏడురోజుల పాటూ సాగినట్లుగా బాహ్య ప్రపంచాన్ని భ్రమింపజేయగలిగారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి జగన్‌ మాత్రం.. చెల్లెలిని యాత్రకు పురమాయించి.. పరిణామాలను గమనిస్తూ కూర్చున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు