తెలంగాణ ఉద్యమం పాక్ తో యుద్ధం ఒకటేనా జానా?

తెలంగాణ ఉద్యమం పాక్ తో యుద్ధం ఒకటేనా జానా?

సొంత పార్టీ నేతలే తనను అనుమానంగా చూస్తుండడంతో ఆ మచ్చ తొలగించుకోవడానికో.. లేదంటే, నిజంగానే వేడి పుట్టిందో కానీ తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి సీఎం కేసీఆర్ పై ఒక రేంజిలో నిప్పులు కక్కారు.  కేసీఆర్ ఉద్యమాన్ని గొప్పగా పొగుడుతున్నారు కానీ సోనియా గాంధీ తలచుకుంటే కేసీఆర్ ఏమయ్యుండేవారోనని... ఆయన ఉద్యమం పాకిస్థాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువేమీ కాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని...  రాష్ట్రంలో అభివృద్ధి జాడ కూడా లేదని ధ్వజమెత్తారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విమర్శలు చేశారు. కాగా... కేసీఆర్ సీఎం అయిన తరువాత జానారెడ్డి ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయని అంటున్న టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్టు చూపి ప్రజలను మరోమారు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఏమైందని జానారెడ్డి నిలదీశారు.

కాగా తెలంగాణలో టీఆరెస్ తో తలపడుతున్న కాంగ్రెస్ కు సీనియర్ల నుంచి సహకారం కొరవడుతోంది. ముఖ్యంగా జానారెడ్డి వంటి నేతలు టీఆరెస్ కు అనుకూలంగా ఉన్నారన్న మచ్చ ఉంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్న ఆయన సభలో పలుమార్లు తమ ఎమ్మెల్యేలనే మందలించిన సందర్భాలున్నాయి. అంతేకాదు... ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడో, సభలో గందరగోళం ఉన్నప్పుడో కేసీఆర్ కానీ, టీఆరెస్ నేతలు కానీ లేచి ‘‘పెద్దలు జానారెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు.. అయినా, కాంగ్రెస్ సభ్యులు గొడవ చేస్తున్నారు’’ అనగానే జానా గాల్లోకి తేలిపోతూ టీఆరెస్ మెప్పుకోసం కాంగ్రెస్ నేతలు నోళ్లు నొక్కేసేవారు. దీంతో చాలాకాలంగా కాంగ్రెస్ నేతలు జానాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయినా, తీరు మార్చుకోని జానా ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా కేసీఆర్ పై ఫైరయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English