పరిషత్ ఎన్నికలు జనసేనకు ఇష్టం లేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోయిన సంవత్సరంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన కోర్టులో పిటీషన్ వేసింది. ఈ మేరకు పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతు పోయిన ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికలు ధౌర్జన్యాలు, బెదిరింపులతో ఏకపక్షం చేసుకున్నట్లు చెప్పారు. అందుకనే అప్పటి ఎన్నికల ప్రక్రియను నూరుశాతం రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.

నాదెండ్ల మనోహర్ డిమాండ్ బాగానే ఉంది కానీ కానీ అది ఆచరణలో సాధ్యంకాదు. ఎందుకంటే అప్పటి ఎన్నికల ప్రక్రియలో సుమారు 24 శాతం వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలయ్యాయి. అలాగే మరికొన్ని చోట్ల ఏక పక్షంగా గెలిచారు. ఇలాంటి చోట్ల చాలావాటిలో రిటర్నింగ్ అధికారులు వాళ్ళ గెలుపును ప్రకటించేశారు. ఇదే విషయమై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆ విజయాలను ధృవీకరించిన విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా పరిషత్ ఎన్నికల విషయమై నిమ్మగడ్డ మాట్లాడుతు మళ్ళీ ఫ్రెష్ గా పరిషత్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. దానిపై వైసీపీ కోర్టుకెక్కింది. కేసును విచారించిన న్యాయస్ధానం గెలుపును రిటర్నింగ్ అధికారులు ప్రకటించేసిన తర్వాత దాన్ని రద్దుచేసే అధికారం ఎలక్షన్ కమీషన్ కు లేదని తేల్చి చెప్పింది. ఎక్కడైనా ప్రకటించకపోతే వాటి విషయాన్ని పరిశీలించాలని చెప్పింది.

నిమ్మగడ్డ వాదననే కోర్టు కొట్టేసినపుడు మళ్ళీ అదే వాదనతో జనసేన కోర్టులో కేసు వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి ఈ విషయం తెలిసికూడా కేసు వేసిందంటే పరిషత్ ఎన్నికలు జరగటం జనసేనకు ఇష్టం లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కోర్టులో ఇదే విషయమై ఎన్నిరోజులు విచారణ జరిగినా చివరకు పాత తీర్పును కోర్టు మళ్ళీ కొత్తగా ఇస్తుందంతే. ఈ మాత్రం దానికి విలువైన సమయం వృధా అవటం తప్ప మరేమీలేదు.