బాబు సిగ్న‌ల్ ఇస్తేనే ఆ ఇద్ద‌రికి కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్‌

బాబు సిగ్న‌ల్ ఇస్తేనే ఆ ఇద్ద‌రికి కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్‌

ఈ హెడ్డింగ్ చూసి ఇదేంటి? అని నోరెళ్ల‌బెడుతున్నారా?  చంద్ర‌బాబంటే ఉప్పు నిప్పుక‌న్నా ఘోరంగా మండిప‌డే కేసీఆర్‌కు బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఏంటి? ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఈయ‌న మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డ‌మేంటి?  అని అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది లాజిక్కంతా! ప్ర‌స్తుతం అటు తెలంగాణ‌, ఇటు ఏపీలోనూ జంపింగ్‌లు పెరిగిపోయారు. దీంతో వారిని సంతృప్తి ప‌రిచేందుకు వాళ్ల‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి వ‌చ్చి టీఆర్ఎస్ కారెక్కిన ముఖ్య నేత‌ల‌కు కేబినెట్‌లో చోటు ఇచ్చే అంశం పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. టీడీపీ నుంచి వ‌చ్చి కారెక్కిన ఎర్ర‌బెల్లి, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, వ‌రంగ‌ల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం విన‌య్‌భాస్క‌ర్ త‌దిత‌రులు కేసీఆర్ మంత్రివ‌ర్గంలో చోటు కోసం ఆశిస్తున్నారు.

అయితే వీరిలో ఎర్ర‌బెల్లి, గుత్తా జంపింగ్‌లు కావ‌డంతో కేసీఆర్ ఒకింత ఆలోచిస్తున్నారు. ఇదే విష‌యంలో గ‌తంలో టీడీపీ నుంచి వ‌చ్చి చేరిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కి మంత్రి ప‌ద‌వి ఇచ్చి అటు తెలంగాణ టీడీపీ నేత‌ల నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇక‌, రేవంత్ రెడ్డి ఏకంగా దీనిపై కోర్టుకు కూడా ఎక్కారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా మ‌రింత మంది జంపింగ్‌ల‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే మ‌రిన్ని త‌ల‌నొప్పులు వ‌స్తాయ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో  ఏపీలోనూ సేమ్ సీన్ కొన‌సాగుతోంది.

అక్క‌డ వైకాపా నుంచి వ‌చ్చిన జంపింగ్‌లు మంత్రి ప‌ద‌వులు కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారిని చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటే తాను కూడా టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట కేసీఆర్. ఇలా చేస్తే.. ఎలాంటి త‌ల‌నొప్పులూ వ‌చ్చే ఛాన్స్ ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఈ మేర‌కు ఇప్పుడు పెద్ద ఎత్తున  క‌థ‌నాలు వ‌స్తున్నాయి. బాబు సిగ్న‌ల్ ఇస్తే..(అంటే.. ఏపీలో సైకిలెక్కిన వైకాపా ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తే).. తెలంగాణ‌లో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌, గుత్తాల‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదీ క‌థ‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు