సారు ని కుడా వదలట్లేదు గా!

సారు ని కుడా వదలట్లేదు గా!

రాజకీయాలు చాలా కరుకుగా ఉంటాయని.. రాజకీయాల్లో బంధాలు.. అనుబంధాలు లాంటివి ఎంతమాత్రం ఉండవని.. కేవలం లెక్కలు.. అప్పటికి కలిగే ప్రయోజనాలు తప్పించి మరెలాంటి భావోద్వేగాలు ఉండవని పలువురు చెబుతుంటారు. ఇలాంటి వాటికి ఎలాంటి వారైనా మినహాయింపు ఎంతమాత్రం కాదన్న మాటను రాజకీయ విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. వారి అభిప్రాయం ఎంత నిజమన్న విషయం తాజాగా మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల విషయంపై తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కు సమానంగా ఉద్యమం చేసిన.. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తాజాగా తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూముల సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిశితంగా విమర్శించిన కోదండరాం.. రైతుల సమస్యల మీద తాము ఎన్నో సలహాలు.. సూచనలు చేసినా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. కోదండరాం మాష్టారు చేపట్టిన దీక్షపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్ ఎజెండాను మోస్తున్నట్లుగా ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో కోదండరాం ద్వంద విధానాల్ని పాటిస్తున్నారని.. మల్లన్నసాగర్ వద్ద రైతుల్ని రెచ్చగొడుతూ దీక్షలు చేశారని.. ఇక్కడ రైతుల పేరుతో దీక్ష చేస్తున్నారని.. ఈ దీక్షల్లో వేటిని నమ్మాలో తమకు అర్థం కావటం లేదని విమర్శించారు. అధికారంపై ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని చూస్తుంటే.. ఉద్యమనేత కోదండరాం వాటికి మద్దతు పలకటం బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. కోదండరాం కాంగ్రెస్ ఎజెండాను మోస్తున్నట్లుగా హరీశ్ చెప్పిన వ్యాఖ్యతోనే అసలు పంచాయితీ అంతా.

తమను దెబ్బ తీసేలా ప్రయత్నించే ఎవరినైనా.. రాజకీయ నేత అస్సలు ఉపేక్షించరు. కోదండరాం మాష్టారి లాంటి వ్యక్తి కమిట్ మెంట్ తెలిసినా.. తమ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే దీక్షల్ని హరీశ్ లాంటివారు అస్సలు తట్టుకోలేరు. అందుకే.. ఆయన కోదండరాం వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా.. కాంగ్రెస్ మాటల్ని అప్పజెబుతున్నారన్నట్లుగా ఆరోపించటం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి కోదండరాం మాష్టార్ని కాంగ్రెస్ ఎజెండా మోస్తున్నట్లుగా విమర్శిస్తున్నారు. మరి.. మొదటి ఒకటిన్నర సంవత్సరం తెలంగాణ అధికారపక్షంపై ఒక్క చిన్న మాట కూడా అనకుండా ఉన్నారు. మరి.. ఆ ఏడాదిన్నర కాలంలో కోదండరాం టీఆర్ఎస్ ఎజెండా మోసినట్లుగా అనుకోవాలా? ఇలాంటి అభిప్రాయాన్ని హరీశ్ లాంటి వారు ఆమోదిస్తారా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు