అమితాబ్.. సచిన్ లు ఉరికే భూములు కొనలేరు

అమితాబ్.. సచిన్ లు ఉరికే భూములు కొనలేరు

రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర ఉద్యమవేత్త.. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్ష చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారి హైదరాబాద్ లో చేపట్టిన భారీ దీక్షకు మద్దతుగా పలువురు మేధావులు.. పలు వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరు కావటమే కాదు.. తమ సంఘీభావాన్ని తెలపటం గమనార్హం.

దీక్ష సందర్భంగా కోదండరాంతో పాటు.. పలువురు వక్తలు మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పలు విమర్శలు చేశారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రత్యామ్నాయ పాలన ఉంటుందని తాను అనుకున్నానని.. కానీ రైతుల ఆత్మహత్యలు చూసిన తర్వాత తనలాంటి వారు సిగ్గు పడాల్సివస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తే.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మరింత ఘాటుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పాలన పిచ్చి తుగ్లక్ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించారు.

చుక్కా రామయ్య లాంటి వారు సైతం తెలంగాణ సర్కారు తీరును తప్పుపట్టటం.. ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. దీక్ష క్రమంలో ఐకాస కొన్ని అంశాలపై తీర్మానాల్ని ఆమోదించారు. ఇలా ఆమోదించిన తీర్మానంలో బిగ్ బీగా సుపరిచితులైన అమితాబ్.. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాంటి వారి పేర్లు ప్రస్తావన రావటం ఆసక్తికరంగా మారింది.

రైతుల ప్రయోజనాలపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించిన ఈ తీర్మానంలో ఇద్దరు ప్రముఖుల పేర్ల ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. భూముల్ని ఎవరు పడితే వారు.. కారణం చెప్పకుండా.. వ్యవసాయం చేయకుండా కొనుగోలు చేయలేరన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ లో.. సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలో ఉరికే భూములు కొనాలంటే కొనలేరని.. వారు భూమిని దున్నుతాం.. వ్యవసాయం చేస్తామని చెబితే మాత్రమే భూముల్ని కొనగలుగుతారని.. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని.. విచ్చలవిడిగా భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. భూమిని ఎవరు పడితే వారు.. వ్యవసాయేతర అవసరాల కోసం కొనుగోలు చేయటం ఉండదన్న అంశాన్ని చెప్పే క్రమంలో అమితాబ్..సచిన్ ప్రస్తావన తీసుకురావటం విశేషం. సాధారణంగా ఉద్యమ తీర్మానాల్లో ప్రముఖల పేర్ల ప్రస్తావన ఉండదు. అందుకు భిన్నంగా కోదండరాం మాష్టారి దీక్ష తీర్మానంలో ఉండటం అందరి దృష్టిని ఆకర్షించేలా చేసిందని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు