ఫోర్ మోర్ షాట్స్ అంటున్న మాస్ రాజా

ఒకప్పుడు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి మినిమం మూడు సినిమాలు చేస్తూ పోయాడు మాస్ రాజా రవితేజ. మినిమం గ్యారెంటీ హీరోగా ఏడాదికి మూడు హిట్లు కొడుతూ వచ్చిన రవితేజకు 2018లో ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ వచ్చాయి. ఆ ఎఫెక్ట్‌తో 2019లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు రవితేజ.

ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన ‘డిస్కోరాజా’ ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వలేదు. దాంతో రవితేజ గేర్ మార్చారట. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోవాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం ‘బలుపు’తో మంచి కమ్‌బ్యాక్ హిట్టు ఇచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేనితో ‘క్రాక్’ సినిమా చేస్తున్న రవితేజ… లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మరో మూడు సినిమాలను ఒకేసారి మొదలెట్టబోతున్నాడు.

‘క్రాక్’ సినిమా షూటింగ్ దాదాపు ముగిసింది. మిగిలిన పార్ట్ లాక్‌డౌన్ ముగియగానే పూర్తిచేసి… రమేశ్ వర్మ, నక్కిన త్రినాథరావు, వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి అంగీకరించాడట గోపిచంద్. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ ‘సతురంగ వేట్టయ్ 2’ను రీమేక్ చేస్తున్న రవితేజ… ‘నాపేరు సూర్య… నా ఇల్లు ఇండియా’తో డైరెక్టర్‌గా మారిన రచయిత వక్కంతం వంశీకి సెకండ్ మూవీ ఛాన్స్ ఇస్తున్నాడు. అలాగే ‘మేం వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’ వంటి సినిమాలతో యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు దక్కించుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో సినిమా కన్ఫార్మ్ చేశాడు.

నలుగురు డిఫరెంట్ దర్శకులతో సినిమాలు చేస్తూ… సినిమా, సినిమాకీ వెరియేషన్ చూపించాలని ఫిక్స్ అయినట్టున్నాడు రవితేజ. ఈ ఫోర్ మోర్ షాట్స్ మనోడికి ఎలా కలిసొస్తాయో చూడాలి.