కీరవాణి.. ఏం ప్లానింగ్ అబ్బా

టాలీవుడ్లో వారసుల హవా గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అలా అని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రతి వారసుడూ క్లిక్ అయిపోతాడనేమీ లేదు. టాలీవుడ్లో పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి, నిర్మాతలుగా మంచి పేరుండి.. కథలను, సినిమాలను జడ్జ్ చేయడంలో గొప్ప నైపుణ్యం కూడా ఉన్న అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్‌లు సైతం తమ కొడుకులకు మంచి కెరీర్ ఇవ్వలేకపోతున్నారు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఎలా తడబడుతున్నాడో తెలిసిందే. అరవింద్ చిన్నబ్బాయి శిరీష్ పరిస్థితి కూడా అంతే.

ఎంతోమంది హీరోలను పెద్ద స్టార్లను చేసిన పూరి జగన్నాథ్ సైతం తన కొడుకు ఆకాశ్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయాడు. హీరోలుగా అనే కాదు.. వేరే రకంగా వారసత్వాన్ని అందుకున్న వాళ్లలోనూ కొందరు తడబడుతున్నారు. ఐతే సంగీత దర్శకుడు కీరవాణి మాత్రం తన ఇద్దరు కొడుకుల కెరీర్లను భలే ప్లాన్ చేశాడే, వాళ్లు చాలా త్వరగా సెటిల్ చేయగలిగాడే అని ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ నడుస్తోంది.

కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ముందు గాయకుడిగా పరిచయం అయ్యాడు. తండ్రి సినిమాల్లోనే కాక వేరే చిత్రాల్లోనూ కొన్ని పాటలు పాడి ప్రతిభ చాటుకున్నాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అతను సంగీత దర్శకుడిగా పరిచయం అయిన తొలి చిత్రం ‘మత్తు వదలరా’ ప్రశంసలందుకుంది. ‘కలర్ ఫోటో’ అతడికి పెద్ద బ్రేకే ఇచ్చింది. ఈ సినిమా పాటలు మార్మోగిపోయాయి. ఇప్పుడు కాలభైరవ చేతిలో మూణ్నాలుగు సినిమాలున్నాయి. సంగీత దర్శకుడిగా అతను సెటిలైపోయినట్లే. ఇక చిన్న కొడుకు సింహా విషయానికి వస్తే.. అతను హీరోగా పరిచయమైన ‘మత్తువదలరా’ మంచి విజయమే సాధించింది. అందులో సింహా నటుడిగా సత్తా చాటాడు. తొలి సినిమాకు నేల విడిచి సాము చేయకుండా, మాస్ ఇమేజ్ అని అర్థం లేని విన్యాసాలు చేయకుండా మంచి పని చేశాడు సింహా. ఆ సినిమా అతడికి డీసెంట్ లాంచింగ్ అయింది.

దీని తర్వాత సింహా నటిస్తున్న ‘తెల్లవారితే గురువారం’ కూడా భిన్నంగా, ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. ఆ చిత్రం విడుదల కాకముందే ఇప్పుడు ‘బాగ్ సాలే’ అంటూ మరో విభిన్నమైన సినిమాను అనౌన్స్ చేశాడు సింహా. ప్రి లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌‌గా అనిపిస్తోంది. సురేష్ బాబు, మధుర శ్రీధర్ రెడ్డి, యాశ్ రంగినేని లాంటి పేరున్న నిర్మాతలు ఈ చిత్రాన్ని టేకప్ చేయడం విశేషం. ప్రణీత్ అనే షార్ట్ ఫిలిం మేకర్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

మిగతా టాలీవుడ్ ప్రముఖుల్లాగా కొడుకుల విషయంలో ఎక్కువ హడావుడి చేయకుండా, భారీతనం కోసం చూడకుండా వాళ్లను సింపుల్‌గా లాంచ్ చేసి, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు సెట్ చేయడం ద్వారా కీరవాణి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కొడుకులిద్దరూ చాలా త్వరగానే సెటిల్ అయిపోయి ఆయనకు టెన్షన్ లేకుండా చేశారు.