బాబు విస్తరణలో జగన్ బ్యాచ్ కు నో ఛాన్స్?

బాబు విస్తరణలో జగన్ బ్యాచ్ కు నో ఛాన్స్?

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ విజయవాడకు వెళ్లటం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరపటం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా రెండున్నర గంటల పాటు గవర్నర్.. ఏపీ ముఖ్యమంత్రి మధ్య ఏకాంత చర్చలు జరగటం పలువురిలో ఆసక్తికరంగా మారాయి. ఈ ఇద్దరు ముఖ్యుల మధ్య అంత భారీగా ఏ అంశాల మీద చర్చ జరిగింది? ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్ ఏం చెప్పారు? గవర్నర్ చెప్పిన అంశాలకు చంద్రబాబు రియాక్షన్ ఏమిటన్న అంశంపై కాస్త లోతుగా దృష్టి పెడితే.. ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పలు అంశాల మీద చంద్రబాబుతో మాట్లాడిన గవర్నర్.. ఈమధ్య కాలంలో తరచూ వినిపిస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశంపై గవర్నర్ తానే కలుగజేసుకొని మాట్లాడినట్లుగా తెలుస్తోంది. త్వరలో విస్తరణ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయన్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు.. నవంబరు రెండో వారంలోపు విస్తరణ ఉంటుందని.. ఈ కార్యక్రమాన్ని బెజవాడలోని ఇందిరాగాంధీ పురపాలక సంఘం స్టేడియంలో చేపట్టనున్నట్లుగా తెలిసింది. ఈ విస్తరణలో తన కుమారుడు లోకేశ్ కు అవకాశం కల్పించనున్నట్లుగా చంద్ర‌బాబు చెప్పినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా విస్తరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయి వచ్చి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వొద్దని గవర్నర్ కోరినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి విజయం సాధించి.. అనంతరం అధికార పార్టీలో చేరిన తలసానిని.. కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిన సందర్భంలో తెలుగుదేశం నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని.. అలాంటి పని చేయొద్దని చెప్పినట్లు సమాచారం. ''ఆ రోజు మీరు నా చర్యను తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు మీరు ఇక్కడ అదే పని నాతో చేయించి ఇతరులు నన్ను తప్పు పట్టేలా చేయొద్దు'' అని బాబుతో గవర్నర్ తో చెప్పినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో విస్తరణలో జగన్ బ్యాచ్ జంపింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English