లోకేష్‌కు క‌విత కౌంట‌ర్

లోకేష్‌కు క‌విత కౌంట‌ర్

ఈ మాట‌న్న‌ది ఎవ‌రా అని అనుకుంటున్నారా?  సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ గారాల ప‌ట్టి, నిజామాబాద్ ఎంపీ క‌విత‌. ఆమెకేంటి లోకేష్‌ని అంత‌మాట అనే ప‌ని? అని మ‌ళ్లీ ప్ర‌శ్నా.. అయితే, ఇది చ‌ద‌వాల్సిందే. రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు కుటుంబ ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి హోదాలో లోకేష్ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా దేశంలో మేం త‌ప్ప ఎవ‌రూ ప్ర‌తి ఏటా ఆస్తులు ప్ర‌క‌టించుకోవ‌డం లేద‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా .. తెలంగాణలోని కేసీఆర్ ప్ర‌భుత్వం బంగారు తెలంగాణ ధ్యేయంతో రాష్ట్రంలోని 10 జిల్లాల‌ను 31 జిల్లాలుగా విస్త‌రించింది. దీనిపైనా లోకేష్ పొలిటిక‌ల్ కామెంట్ల‌తో విరుచుకుపడ్డారు. జిల్లాల విభ‌జ‌న వెనుక పొలిటిక‌ల్ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప మ‌రేమీలేవ‌ని అన్నారు.

అయితే, తెలంగాణ స‌హా కేసీఆర్ స‌ర్కారుపై ఈగైనా వాల‌నివ్వ‌ని క‌విత‌.. లోకేష్ కామెంట్ల‌పై ఫైరైపోయారు. గ‌తంలోనూ టీఆర్ ఎస్ ఎన్నిక‌ల గుర్తు కారు డొక్కుద‌ని, పాత‌ప‌డిపోయింద‌ని లోకేష్ చేసిన కామెంట్ల‌పై క‌విత విరుచుకుప‌డ్డారు. పంచ‌రైన సైకిల్ లోకేష్‌దేన‌ని, దానిమీద లోకేష్‌తో పాటు ఒక్క‌రికి త‌ప్ప ఇంకెవ‌రికీ చోటు ఉండ‌ద‌ని, త‌మ ది ఓల్డ్ కారైనా గోల్డ్ అని ఎంత‌మందినైనా ఎక్కించుకుని ర‌య్య‌న దూసుకుపోవ‌డ‌మే దానికి తెలుస‌ని ఆమె ఎద‌రు విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ప్రెస్ క్ల‌బ్‌లో మీడియాతో మాట్లాడిన క‌విత‌.. లోకేష్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు.

ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని అన్నారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుటుందని... ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని కవిత సూచించారు. మ‌హిళ‌ల‌కు మంత్రి వ‌ర్గంలో చోటు ఇవ్వ‌క‌పోయినా.. సీఎం  కేసీఆర్ రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌ను గౌర‌వంగానే చూసుకుంటున్నార‌ని అన్నారు. మొత్తానికి లోకేష్ పాలిటిక్స్ విష‌యంలో కవిత ఏపీకే ప‌రిమితం అవ్వాల‌ని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు