‘ఆ ఏడు రోజులే’ చెల్లెమ్మ ఎజెండా!

‘ఆ ఏడు రోజులే’ చెల్లెమ్మ ఎజెండా!

వైఎస్‌ జగన్‌ ఏడు రోజుల పాటు ఆమరణ నిరాహార దక్ష చేసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మైలేజీ.. వైకాపా పట్ల ఏర్పడిన సానుకూలత.. ఆయనకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించి దీక్షను బలవంతంగా భగ్నం చేసిన వెంటనే పలచబడడం ప్రారంభమైంది. సమైక్యానికి సంబంధించి జగన్‌ చేసిన దీక్ష ఒక్కటే దిక్కూ మొక్కూ అయితే పరిస్థితి ఇంకోలా ఉండేది. అయితే కొన్ని లక్షల మంది ప్రతిరోజూ చేస్తున్న దీక్షలు, ఉద్యమాలు, ప్రదర్శనల్లో జగన్‌ చేసిన దీక్ష ఒక చిన్న భాగం మాత్రమే.  కాకపోతే అందరికంటె ఎక్కువగా ఆయన ఏడు రోజుల పాటూ నిరాహారంగా ఉండడం సహజంగానే అందరిలో సానుభూతి కలిగించింది. ఆయన దీక్ష విరమించాక కూడా .. ప్రజలు మాత్రం.. దానితో నిమిత్తం లేకుడా.. తమ ఉద్యమాన్ని తాము యథారీతిగా కొనసాగిస్తున్నారు. జగన్‌ దీక్ష విరమించేశాడనే పట్టింపు గానీ, ఆయన ఇంకా ఏదైనా చేయాలనే ఎదురుతెన్నులుగానీ ఎవ్వరిలోనూ లేవు.

అయితే ఆయన దీక్షను పురస్కరించుకుని పార్టీ మైలేజీని సజీవంగా ఉంచుకోవడమే లక్ష్యంగా చెల్లెమ్మ షర్మిల సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతోంది.  సమైక్యశంఖారావంగా నామకరణం చేసిన ఈ యాత్ర.. ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించాక తిరుపతి సభతో మొదలవుతుంది.

షర్మిల పాదయాత్ర చేసినంత కాలమూ.. ఆమె యాత్రకు ఒక నిర్దిష్టమైన ఎజెండా ఉండేది. అదేంటంటే.. ‘రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.. జగనన్నతోనే అది సాధ్యమవుతుంది.’ ఈ వాక్యానికి ముందు వెనుకగా అనేక వాక్యాలను పేర్చుకుంటూ అటు సోనియా, ఇటు కిరణ్‌ లను తూర్పారపడుతూ.. రాజన్న పథకాలను పొట్టన పెట్టుకున్నారనే పడికట్టు పదాలను పేర్చుకుంటూ ఏదో నడిపిస్తూ వచ్చారు.

అదేరీతిగా ప్రస్తుతం ఆమె చేపడుతున్న బస్సు యాత్రకు కూడా నిర్దిష్టమైన ఎజెండాను పార్టీ వ్యూహకర్తలు ఖరారు చేశారు. అదే జగన్‌ దీక్ష. నిజానికి సమైక్య రాష్ట్రం కోసం దీక్షలు చాలా మంది నాయకులు చేశారు. అందరి దీక్షలు భగ్నం చేసి పోలీసులు ఆస్పత్రుల్లో చేర్చేశారు. అయితే అందరికంటె తన అన్న రెండు రోజులు ఎక్కువ దీక్ష చేశాడు గనుక.. సమైక్యానికి అన్నయ్య ఒక్కడే దిక్కు అనే రీతిలో మైలేజీ సాధించేలా ప్రసంగాల ఎజెండాను రూపొందించినట్లు సమాచారం. జగన్‌ దీక్ష ముగిసినా.. దాని గురించిన చర్చ ప్రజల్లో మరుగున పడకుండా.. షర్మిల బస్సు యాత్రలో నిరంతరం ఆ విషయమే మాట్లాడేలా ఆమెకు ట్రైనింగు కూడా ఇచ్చారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు