ముద్ర‌గ‌డ‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ట‌

ముద్ర‌గ‌డ‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ట‌

కాపుల రిజ‌ర్వేష‌న్ అంశం మ‌రోమారు ఏపీలో వేడి పుట్టిస్తోంది. కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రపై ప్రారంభం గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఇటు కాపు సామాజిక వ‌ర్గ నేతల్లో అటు అధికార పార్టీ శిబిరాల్లో చ‌ర్చోప‌చర్చ‌లు సాగుతున్నాయి. ఇదే విష‌యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ముద్ర‌గ‌డ‌ను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆదేశించారు. రావులపాలెం నుంచి ప్రారంభం కానున్న ముద్రగడ పాదయాత్రపై రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడవద్దని, ఆ అవసరం మనకు అవసరం లేదని బాబు చెప్పిన‌ట్లు స‌మాచారం. ‘ముద్ర‌గ‌డ చేస్తున్న‌ది ఆయ‌న సొంత‌ డిమాండ్ల కోసం చేస్తున్న పాదయాత్ర. కానీ మనం కాపులకు ఏం చేశామో కాపులకు తెలుసు. అయినా మనం ఏమీ చేయడం లేదని ముద్రగడలాంటి వాళ్లు కొంతమంది మాట్లాడుతుండటం వల్ల ఏర్పడే గందరగోళాన్ని తొలగించి, వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. దాన్ని మాత్రం విస్మరించకూడదు. మనం ఏమీ చేయడం లేదన్న వాళ్ల విమర్శలపై వాస్తవాలతో ఎదురుదాడి చేయండి. దానిపై మౌనంగా ఉండాల్సిన పనిలేదు. కానీ ఎక్కడా రెచ్చగొట్టవద్దు. మనం చేసింది చెప్పుకోవడంలో ఎవరికీ భయపడాల్సిన పనిలేదు’ అని బాబు వ్యాఖ్యానించారు. త‌ద్వారా ప్ర‌భుత్వం ఏం చేసింది, ఏం చేయ‌నుంది అనే విష‌యంలో క్లారిటీ వ‌స్తుంద‌ని చంద్రబాబు పార్టీ నేత‌ల‌కు వివ‌రించారు.

అదే సందర్భంలో పార్టీ విధి విధానాల‌పైనా బాబు వారితో చ‌ర్చించారని స‌మాచారం. కాపులకు రిజర్వేషన్ల నేపథ్యంలో బీసీలకు వాస్తవాలు వివరించాలని ఈయ‌న సూచించారు. ‘మన పార్టీకి బీసీలే ఆధారం. వాళ్లు లేకపోతే పార్టీ లేదు. గత ఎన్నికల్లో బీసీలంతా పార్టీకి ఓటు వేశారు. వారి రుణం తీర్చుకోవాలి. అందుకే బీసీల కోసం అనేక పథకాలు పెడుతున్నాం. వాటి గురించి ఎక్కువ ప్రచారం చేయండి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మనం బీసీ విధానాల నుంచి వైదొలగేదిలేదు. బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నాం. దానికోసం కమిషన్ వేశాం. ఇన్నేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీగానీ, వైఎస్ ప్రభుత్వం గానీ కాపులను రాజకీయంగా వాడుకోవడమే తప్ప వారికి చేసిందేమీ లేదు. మనం ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నాం. భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు వెళ్లకూడదు. ఇదే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పండి. కాపు రిజర్వేషన్లపై బీసీల్లో ఆందోళన లేకుండా వాస్తవాలను మీరు తీసుకువెళ్లండి’ అని బాబు ఆదేశించారని పార్టీ నేత‌లు పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు