గంటాకు యాంటీగా టీడీపీ ఎమ్మెల్యేల స‌మావేశం

గంటాకు యాంటీగా టీడీపీ ఎమ్మెల్యేల స‌మావేశం

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకి త‌న సొంత జిల్లా విశాఖ‌ప‌ట్నం ఎమ్మెల్య నుంచే పెద్ద షాక్ త‌గిలింది! జిల్లా అభివృద్ధి కోసం ఎంత ప్ర‌యత్నించినా.. భూములు కేటాయించేందుకు ముందుకు రాని అధికారులు గంటా కోసం ప‌ళ్లెంలో పెట్టి మ‌రీ భూములు అప్ప‌గించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విష‌యంలోకి ఎంట‌రైపోతే.. ప్ర‌స్తుతం ఫిలిం ఇండ‌స్ట్రీతో మంత్రి గంటాకు పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. ఇటీవ‌ల ఆయ‌న కుమారుడు ర‌వితేజ హీరోగా అరంగేట్రం చేశాడు కూడా. దీంతో మంత్రికి మూవీ ఫీల్ఢ్‌తో సంబంధాలు ప‌టిష్ట‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో విశాఖ‌లో ఫిలింన‌గ‌ర్‌ని విస్త‌రించేందుకు ప్లాన్ చేస్తున్న హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ఫిలింన‌గ‌ర్ సొసైటీ ఈ విష‌యంలో మంత్రి గంటాను సాయం కోరింది.

అంతేకాదు, విశాఖలో భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత గంటాపై ఒత్తిడి తెచ్చార‌ని, దీనికి ఆయ‌న ఫ్లాట్ అయిపోయార‌ని తెలుస్తోంది.  ఈ క్ర‌మంలోనే  కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395,413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను ఫిల్మ్ నగర్ సొసైటీకి అధికారులు అప్ప‌గిస్తున్నార‌ని స‌మాచారం. అయితే, ఇక్క‌డ‌ ట్విస్ట్ ఏంటంటే.. ఆ భూముల‌ను ఎన్నాళ్ల‌కు లీజుకు ఇస్తున్నారు? ఎంత మొత్తానికి ఇస్తున్నారు? వ‌ంటి విష‌యాల‌ను అధికారులు వెల్ల‌డించ‌డం లేదు. మ‌రో టాక్ ఏంటంటే ఫిలింన‌గ‌ర్ సొసైటీ ఒక్క పైసా కూడా ఈభూముల కోసం చెల్లించ‌లేదట‌!

వాస్త‌వానికి మార్కెట్ ధ‌ర ప్ర‌కారం 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100 కోట్లకు పైమాటేన‌ని స్థానికులు చెబుతున్నారు. పోనీ.. విశాఖ క‌లెక్ట‌ర్ వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం చూసుకున్నా..  ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా ఉంది. దీనిని బ‌ట్టి 17 ఎక‌రాల‌ను సుమారుగా రూ.37.85 కోట్లను ఫిలిం న‌గ‌ర్ సొసైటీ చెల్లించాలి. కానీ, ఎలాంటి చెల్లింపులు లేకుండానే మంత్రి గంటా అండ‌తో.. వారు ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని, ఈ క్ర‌మంలోనే భూమి పూజ కూడా చేసేశార‌ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు.

స్థానిక జిల్లా అవ‌స‌రాల‌కు,  పరిశ్రమలకు, వాటర్ క్లబ్‌కు భూములివ్వమని కోరితే లేవని చెబుతున్న జిల్లా మంత్రులు ఏవిధంగా 17 ఎకరాలు కేటాయించారంటూ మండిప‌డుతున్నారు. ఇప్పుడు వీరికి బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్య‌క్షుడు హ‌రిబాబు కూడా తోడైన‌ట్టు తెలుస్తోంది. ఈయ‌న కూడా ఈ విష‌యంలో గంటాపై ప‌రోక్షంగా దాడి చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే సర్క్యూట్ హౌస్ లో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశ‌మైన‌ట్టు తెలుస్తోంది. మంత్రి గంటా వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయాల‌ని వారు డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ విష‌యం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు