విరాట్ కోహ్లి గాళ్‌ఫ్రెండ్ ఎవరు?

విరాట్ కోహ్లి గాళ్‌ఫ్రెండ్ ఎవరు?

ఉద్యోగార్ధుల పోటీ పరీక్షల్లో సినీతారల గురించిన ప్రశ్నలు ఎదురవడం సహజం. నటీనటులు లేక వారి సినిమాలు ఏదైనా అత్యున్నత పురస్కారం గ్రహిస్తేనో ఇలాంటి క్వశ్చన్స్ ఎదురవుతుంటాయి. ఇంత వరకూ బాగానే ఉంటుంది. కానీ సెలబ్రిటీల లవ్ అఫైర్ల గురించి అడిగితే? ఆశ్చర్యంగా ఉంది కదూ. మహారాష్ట్ర భివాండీలోని చాచా నెహ్రూ హిందీ హై స్కూల్‌లో ఫిజికల్ ట్రైనింగ్ పరీక్ష పత్రంలో.. క్రికెటర్, టెస్ట్ కెప్టెన్ "విరాట్ కోహ్లి గాళ్‌ఫ్రెండ్ ఎవరు?" అనే బహుళ ఐచ్ఛిక ప్రశ్న దర్శనమిచ్చింది. దీనికి ఆప్షన్స్‌గా ప్రియాంక, అనుష్క, దీపిక అంటూ ఆప్షన్స్‌ కూడా పొందుపరిచారు మహా జ్ఞానులైన పేపర్ రూపకర్తలు. ఈ ప్రశ్నను 9వ తరగతి విద్యార్ధులపై సంధించడం మరో విశేషం. క్రీడా రంగానికి సంబంధించి ఏ అంశమూ దొరకనట్టు విరాట్.. ప్రియురాలిపై ప్రశ్న అడగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంటే, ఇక నుంచి విద్యార్ధులు పాఠ్యాంశాలనే కాక సినీ యాక్టర్లు, క్రీడా ప్రముఖలు ఎవరెవరు ఎవరితో సంబంధాలు పెట్టుకుని, చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారో కూడా తెలుసుకోవాలేమో?

గత నెలలోనే వాయు సేన నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్ష పత్రంలో దీపిక పదుకోన్ 'పీకూ' సినిమా గురించి ఓ ప్రశ్న సంధించారు. తాము చదువుకున్న చదువుకు, పీకూ సినిమాకు లింకేంటో తేలీక పరీక్ష రాస్తున్నవారు తలపట్టుకున్నారు. అంతకు ముందు తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ విద్యార్ధులు "బాహుబలి లాంటి యుద్ధ పోరాటాలకు సంబంధించిన సెట్స్ డిజైన్ చేయండి" అనే ప్రశ్న ఎదుర్కొన్నారు. క్వశ్చన్ పేపర్స్‌లో సినిమాలకు సంబంధించి ఈ తరహా ఎంక్వైరీలు విద్యార్ధులనే కాదు సాధారణ జనాలనూ నిర్ఘాంతపరుస్తున్నాయి. పేపర్లు సెట్ చేసే వారికి సినిమాలంటే ఆసక్తి ఉండొచ్చు. కానీ ఆ పైత్యాన్ని ఇతరులమీద రుద్దేయడం ఎంతవరకు సబబు? ఓ చిత్రాన్ని వారు చూసి ఉండొచ్చు. కానీ అంతా చూసి..తరించి.. మెదళ్లలో ఎక్కించేసుకుని పరీక్షల్లో ప్రతిబింబిస్తారనుకోవడాన్ని ఏమనాలి? ఈ సంగతి గుర్తుంచుకుని, పరీక్ష పత్రాల రుపకర్తలు.. తమ సినీ నాలెడ్జ్‌ను కాస్త పక్కనపెట్టి సబ్జెక్టుకు తగ్గ ప్రశ్నలు అడిగితే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు