కేసీఆర్‌కు కొత్త పేరు పెట్టిన టీడీపీ

కేసీఆర్‌కు కొత్త పేరు పెట్టిన టీడీపీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరును తెలుగుదేశం పార్టీ మార్చివేసింది. కేసీఆర్‌కు ప్రియ‌మైన ఫాంహౌస్‌లో ఆయ‌న పండిస్తున్న పంట‌ల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత అరికెల నర్సారెడ్డి సెటైర్లు వేశారు. రైతుల ప‌రిస్థితిని ప్ర‌స్తావిస్తూ రైతాంగాన్ని దారుణంగా నిర్లక్ష్యం చేసిన తెరాస సర్కారు, బతుకమ్మ దీపావళి పేర్లతో సంబురాలకు సంబురాలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేస్తున్న మేలు ఏమీలేదని మండిప‌డ్డారు. కేసీఆర్ సూటూ బూటూ వేసుకున్న ఫాంహౌస్ రైతు కాబ‌ట్టే తెలంగాణ‌లో రైతుల‌కు క‌ష్టాలు లేవ‌ని కామెంట్లు చేస్తున్నార‌ని న‌ర్సారెడ్డి మండిప‌డ్డారు. మిర్చి పసుపు, సోయ రైతుల కష్టాలు సూటూ బూటు వేసుకునే క్యాప్సికం ఫాంహౌస్ రైతు కేసీఆర్‌కు తెలిసే అవకాశం లేద‌ని న‌ర్సారెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలకు ఎజెండాయే దొరకడం లేదని హేళన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని న‌ర్సారెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది రైతుల్లో ఒక్క రైతుకైనా రుణమాఫీ జరిగి, కొత్త రుణాలు ఇచ్చిన పాపాన పోలేద‌ని ఆయ‌న నిల‌దీశారు. అయినప్పటికీ 8 లక్షల మంది రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా బ్యాంకర్ల చేత చెప్పించడం దివాలాకోరుతనమ‌ని విమ‌ర్శించారు. ఆ 8 లక్షల మంది రైతులు రుణాలను రెన్యువల్ చేసుకొన్నవారేతప్ప కొత్త రుణాలను పొందినవారు కారని తెలిపారు. వర్షాలకు అధికంగా నష్టపోయిన వారికి పరిహారం, రైతులందరికీ ఏకమొత్తంలో రుణమాఫీ జరగాలని న‌ర్సారెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు చిల్లిగవ్వ సాయం చేయని ఈ కేసీఆర్ సర్కారు కూతురికి బతుకమ్మ పేరుతో రూ.15 కోట్ల ఖర్చుపెడుతుందని వ్యాఖ్యానించారు. వర్షాలు పడితే అదేదో తమ ఘనతగా ప్రచారం చేసుకొనే పరిస్థితుల్లో తెరాస సర్కారు ఉన్నదని ఎద్దేవా చేశారు. దేవుడిచ్చిన వరాన్ని త‌న పాలన ఘ‌న‌త వ‌ల్లే అని చెప్పుకున్న మహా మహా నాయకులు ఏమైపోయారో చూశాం అంటూ ప‌రోక్షంగా దివంగ‌త సీఎం వైఎస్ సంద‌ర్భాన్ని గుర్తుచేశారు.

తెలంగాణ ఉద్యమం పుట్టిన మంథనిలోని ఆర్మూరు గ్రామం వ్యవసాయంలో కష్టాలకు కుదేలై, ఇన్పట్ సబ్సిడీ కోసం తెరాస జెండా గద్దెలను పగలగొట్టి మళ్లీ ఉద్యమ బాట పట్టింద‌ని న‌ర్సారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ కండువాలు వేసుకొని టీఆర్ఎస్ గద్దెలు పగలగొట్టిన ఆర్మూర్ ప్రజలెవరూ తెలుగుదేశం లేదా ఇతర పార్టీల కార్యకర్తలు కానే కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  రైతన్న కష్టాలను ఛానళ్లలో ప్రసారం కాకుండా బంద్ చేయించినంత మాత్రాన నిజం దాగదని కేసీఆర్ గ్రహించాలని సూచించారు. నాడు చిన్న రాష్టమైతే ఏదో చేసేస్తామని చెప్పకుని అధికారంలోకి వచ్చిన తెరాస ఈ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదని చెప్పారు. ఈ రోజు చిన్న జిల్లాల పేరుతో మభ్యపెట్టినా జరగబోయేదేమీ లేద‌న్నారు. తక్షణమే సోయాకు నష్టపరిహారం, భూసారం పెంపుకు ఎకరానికి రూ. లక్ష రూపాయలు పరిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు