ఎప్పుడేం చేయాలో వాళ్లకు తెలీదు!!

ఎప్పుడేం చేయాలో వాళ్లకు తెలీదు!!

రాజకీయాల్లో ప్రభుత్వ-విపక్షాల మధ్య ఆరోపణల పర్వం మామూలే అయినా తెలంగాణలో ఈ విమర్శల జోరే కాస్త విభిన్నంగా ఉంటుంది. గుక్కతిప్పుకోకుండా టీఆర్‌ఎస్ సర్కార్ చేసే ప్రతిదాడికి ప్రతిపక్షం దిక్కులు చూసే పరిస్థితి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న యత్నాలను తనదైన శైలిలో తిప్పికొడుతోంది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో అప్పోజిషన్‌కు పొజిషన్‌ లేకుండా చేయాలని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మంత్రి హరీష్‌రావు తన వాగ్ధాటితో తాజాగా విపక్షాన్ని జాడించేశారు. కాంగ్రెస్, టీడీపీలకు అజెండా లేదని ఓ కామెంట్ విసిరి, ఆ పార్టీల నేతలకు ఎప్పుడేం చేయాలో తెలీదంటూ ఎద్దేవా చేశారు. హరీష్‌రావు చేసిన ఈ విమర్శ ఎవ్వరికైనా పౌరుషం తెప్పించేదే. సాధారణంగా ప్రణాళిక లేకుండా రాజకీయాల్లో ఎవ్వరూ ఏ పని చేయరు. అలాంటిది విపక్షాలపై ఈ రేంజ్‌లో మంత్రి ఫైర్ అవ్వడం ఆసక్తిగా మారింది.

కొత్త జిల్లాల ఏర్పాటులో, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రవాసుల్లో కొంత అసంతృప్తి నెలకొన్న మాట వాస్తవం. ఈ అసంతృప్తులకు విపక్షాల మద్దతునివ్వడంతోనే హరీష్‌రావు విమర్శలకు పదును పెట్టారు. సర్కార్‌పై ఉన్న కొద్దిపాటి వ్యతిరేకత విపక్షాలపై సానుభూతి పెంచకుండా అడ్డుకునేందుకు యత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు ఓ ప్రణాళిక లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని అంటున్నారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు, ప్రాజెక్టులపై ప్రశ్నించే నైతికత టీడీపీ లేదని చెప్తున్నారు. మొత్తంగా విపక్షాలపై విపరీతంగా విరుచుకుపడుతూ సానుభూతి పవనాలు టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్లస్ కాకూడదని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు హరీష్‌రావు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు