పేరు వ‌స్తుంద‌నే హోదా వ‌ద్ద‌న్నార‌ట‌

పేరు వ‌స్తుంద‌నే హోదా వ‌ద్ద‌న్నార‌ట‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని దాదాపుగా కేంద్ర ప్ర‌భుత్వం తేల్చిచెప్పిన నేప‌థ్యంలో ఉద్య‌మించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు కొత్త ప్ర‌చారం మొద‌లుపెట్టింది. ఏపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధుల రెండ్రోజుల శిక్షణ తరగతులను  ప్రారంభించిన సంద‌ర్భంగా రాష్ట్ర శాఖ‌ అధ్యక్షుడు డా. ఎన్ రఘువీరారెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. వేల అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై దండయాత్ర చేస్తూ పాలన సాగిస్తోందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ-బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్తకొత్త అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు క్రెడిట్ వస్తుందని హోదాను అమలు చేయకుండా టీడీపీ-బీజేపీ కుట్ర చేశాయని ర‌ఘువీరా అన్నారు.

రాష్ట్రంలో మీడియాను కూడా నియంత్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, అందుకే పీసీసీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఘాటుగా ఎదుర్కోవాలని ర‌ఘువీరా కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో వేలకోట్ల అవినీతి జరుగుతోందని, దీన్ని కాంగ్రెస్ ప్రతినిధులు సమర్ధవంతంగా తగిన సమాచారంతో ప్రజలకు చేర్చేలా కృషిచేయాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర‌-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ద్రోహం చేశాయని, కాంగ్రెస్ పార్టీ హోదా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి 11 పార్టీలను సమీకరించిందని రఘువీరా చెప్పారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో ప్యాకేజీల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకున్నారని ఆరోపించారు. హోదా అమలు చేసేంతవరకు రాజీ లేకుండా కాంగ్రెస్ పోరాడుతుందని కేవీపీ చెప్పారు. ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను, పునర్విభజన చట్టంలోని అంశాలను కొత్త ప్యాకేజీగా చెప్పడం బీజేపీ-టీడీపీల పచ్చి మోసమని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విపలమైందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ద్వారా వేల కోట్లు సంపాదించేందుకే పథకాలు రూపొందిస్తోందని, గతంలోని ప్రభుత్వాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పథకాలు అమలు చేసేవని ఆయ‌న‌ అన్నారు. రాజధాని రహస్య ఒప్పందాలు, స్విస్ ఛాలెంజ్ విధానాలు అవినీతి సొమ్ముల కోసమే చంద్రబాబు చేపట్టారని, రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు