రోడ్డు లేని హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తాయా?

రోడ్డు లేని హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తాయా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ పైన విమర్శలు చేయటం అంత ఈజీ కాదు. తెలంగాణ సర్కారులో కీలకభూమిక పోషిస్తున్న వీరిని విమర్శలు చేసేందుకు వెనుకాడుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు కేటీఆర్ పై విమర్శలు చేశారు. అది కూడా.. ఆయన సమర్థతను క్వశ్చన్ చేసేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తీరును ప్రశ్నించిన వీహెచ్.. ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు కొట్టుకు పోయాయని.. నల్లాలు బాగుపడలేదని.. కానీ కేటీఆర్ మాత్రం అమెరికా టూర్ కు వెళ్లారని విమర్శించారు. అయినా.. కేటీఆర్ కు అన్నేసి కీలక శాఖలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటంటూ ప్రశ్నించిన వీహెచ్.. హైదరాబాద్ లో గల్లీ గల్లీ తెలిసిన నాయకులకు మున్సిపల్ శాఖను కేటాయిస్తే మంచిదన్నారు.

హైదరాబాద్ రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైందన్న ఆందోళన వ్యక్తం చేసిన వీహెచ్.. ఇలాంటి రోడ్లను చూస్తే పెట్టుబడుదారులు వస్తారా? అంటూ ప్రశ్నించారు. వీహెచ్ అన్నారని కాదు కానీ.. ఆయన మాటల్లో నిజం లేకపోలేదు. ఈ రోజు అమెరికాకు వెళ్లి.. వరుస పెట్టి పెట్టుబడిదారులతో భేటీ అయి.. హైదరాబాద్ మహా నగరం గొప్పతనం గురించి గొప్పలు చెప్పేస్తున్న కేటీఆర్ వారు.. భాగ్యనగరానికి వచ్చి పట్టుమని పది కిలోమీటర్లు ప్రయాణిస్తే.. నగర రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న విషయం అర్థమయ్యే పరిస్థితి. నగర గొప్పతనాన్ని విదేశాల్లో ప్రొజెక్టు చేసే ముందు.. నగరానికి ఎంతోకొంత చేస్తే బాగుంటుందేమో? ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత.. పని విషయంలో కూడా దృష్టి పెడితే బాగుంటుందేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు