కేసీఆర్ కామెంట్ ఆయ‌న్నే చిక్కుల్లో ప‌డేసిందా?

కేసీఆర్ కామెంట్ ఆయ‌న్నే చిక్కుల్లో ప‌డేసిందా?

ఒక్కోసారి ఆత్మ‌విశ్వాసం అన‌వ‌స‌ర చిక్కుల‌ను తెచ్చిపెడుతుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు చేసిన‌ వ్యాఖ్య‌లు ఇపుడు అదే ప‌రిస్థితిని క‌లిగించాయ‌ని అంటున్నారు. ఇటీవ‌ల పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతూ తాను నిర్వ‌హించిన స‌ర్వేలో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్‌కే వ‌స్తాయ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై శాస‌న‌మండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయ‌కుడు షబ్బీర్‌ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాలకు ఏడు, ఎనిమిది సీట్లకు మించి రావని కేసీఆర్‌ చేసిన కామెంట్స్ పై ఆయ‌న‌కైనా న‌మ్మకం ఉందా అని ష‌బ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు సర్వేలపై అంత నమ్మకం ఉంటే .. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు రావాలంటూ సవాల్‌ విసిరారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలు నిర్ణయిస్తారని ష‌బ్బీర్ అలీ  స్ప‌ష్టం చేశారు. మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి అయినా అమలుకు నోచుకుందా అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం యూ టర్న్‌ తీసుకోవడం కేసీఆర్‌ కు అలవాటుగా మారిందని ష‌బ్బీర్ అలీ మండిప‌డ్డారు. 12శాతం రిజర్వేషన్‌ పై  మీ చిత్త శుద్ధి  ఏద‌ని ప్ర‌శ్నించారు. ఎలాంటి ష్యూరిటి లేకుండా మైనార్టీలకు లోన్‌ లు ఇస్తామన్న కేసీఆర్‌ మాటలు నమ్మి 1.60 లక్షల మంది రుణం కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వాటితో పాటు 7వేల షాదీ ముబారక్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ముందు వాటిని పరిష్కరించాలని ష‌బ్బీర్‌ డిమాండ్‌ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు