ముగ్గురు మంత్రుల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌

ముగ్గురు మంత్రుల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌

పాలిటిక్స్‌లో ఎవ‌రు ఎప్పుడు ఎలా దెబ్బేస్తారో చెప్ప‌డం క‌ష్టం! త‌మ ప‌క్క‌నే ఉంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీకి ఓటేయ‌డం, అధికార ప‌క్షంలో ఉండి విప‌క్షానికి మ‌ద్ద‌తివ్వ‌డం ఇటీవ‌ల సర్వ‌సాధార‌ణంగా మారింది. ఇప్పుడు ఇలాంటి సీన్‌నే ఏపీ అధికార ప‌క్షం టీడీపీ ఎదుర్కొంది. అదికూడా మంచి ప‌ట్టున్న కృష్ణా జిల్లాలోనే కావ‌డంతో సీఎం చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగినంత ప‌నైంది. ఈ జిల్లాలోని పెడ‌న మునిసిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి జ‌రిగిన మ‌ధ్యంత‌ర‌ ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌హిళా కౌన్సిల‌ర్ వైకాపా అభ్య‌ర్థికి ఓటేసి పెద్ద సంచ‌ల‌నానికి తెర‌దీశారు. దీంతో టీడీపీ చేతిలో ఉన్న ఛైర్మ‌న్ ప‌ద‌వి కాస్తా.. వైకాపా ఆక్ర‌మించుకుంది. దీనిపై అగ్గిమీద గుగ్గిల‌మైన సీఎం చంద్ర‌బాబు..కృష్ణా జిల్లా కీల‌క నేత‌ల‌ను ఉతికి ఆరేశారు.

కృష్ణా జిల్లా పెడ‌న మునిసిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి 2014 ఏప్రిల్‌- మే మ‌ధ్య‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ప‌ద‌విని టీడీపీ నేత ఎర్రా శేష‌గిరిరావు ద‌క్కించుకున్నారు. ఎర్రా ఇటీవ‌ల ఆక‌స్మికంగా మృతి చెందారు. దీంతో ఈ ఛైర్మ‌న్ ప‌ద‌వికి మ‌ధ్యంతర ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. దీంతో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు కొల్లు ర‌వీంద్ర‌, దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, ఇన్‌ఛార్జ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు చంద్ర‌బాబు ఈ ఎన్నిక బాధ్యత అప్ప‌గించారు. అదే స‌మ‌యంలో స్థానిక ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణకు కూడా పెద్ద ఎత్తున బాధ్య‌త అప్ప‌గించారు.

అయితే, అస‌లు టైంకి వ‌చ్చేస‌రికి టీడీపీ కౌన్సిల‌ర్‌గా ఉన్న స్ర‌వంతి టీడీపీ అభ్య‌ర్థిని కాద‌ని వైకాపా అభ్య‌ర్థి ఆనంద ప్ర‌సాద్‌కు ఆమె ఓటేశారు. దీంతో టీడీపీ త‌న సిట్టింగ్ ప‌ద‌విని బంగారు ప‌ళ్లెంలో పెట్టి మ‌రీ విప‌క్ష వైకాపాకు అప్ప‌గించిన‌ట్ట‌యింది. ఈ విష‌యం తెలిసిన సీఎం చంద్ర‌బాబు వ‌రుస పెట్టి అటు మంత్రులు, ఎంపీ, స‌హా స్థానిక‌ ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావుల‌కు క్లాస్ ఇచ్చారు. అధికార ప‌క్షంలో ఉండి, ఇంత మంది మంత్రులు ప‌ర్య‌వేక్షిస్తూ.. కూడా ఒక్క సిట్టింగ్ సీటును కాపాడుకోలేక పోయినందుకు వారిని ఉతికి ఆరేశారు.

ఇదిలావుంటే, టీడీపీ మునిసిప‌ల్ ఛైర్మ‌న్ పోగొట్టుకోడానికి.. వైకాపా ఎంత పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నించిందో.. అంతే త‌ప్పుల‌తో టీడీపీ దానిని పోగొట్టుకుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. కాగిత వెంక‌ట్రావుకు వ్య‌తిరేకంగా కొన్ని వ‌ర్గాలు చ‌క్రం తిప్ప‌డం, మంత్రులు ఈ ఎన్నిక‌ను లైట్‌గా తీసుకోవ‌డం, ఎంపీ కొన‌క‌ళ్ల కుమారుడు వేలు పెట్ట‌డంతోనే ఈ ప‌రిణామం ఎదురైంద‌ని వారు అంటున్నారు. త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో తన మంత్రి పదవి ఊడిపోతుందని, కాగితకు మంత్రి పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారానికి భయపడి మంత్రి కొల్లు రవీంద్ర పథకం ప్రకారం తెరవెనుక ఉండి కాగిత‌ వెంకటరావును దెబ్బకొట్టారని కొంద‌రు అంటుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి త‌న కుమారుడిని పోటీ చేయించేందుకు ఎంపీ కొన‌క‌ళ్ల ఇలా కాగిత‌కు దెబ్బేశార‌న్న మ‌రో టాక్ వ‌స్తోంది. ఏదేమైనా ఇందుకు బాధ్యులైన ముగ్గురు మంత్రుల‌కు చంద్ర‌బాబు ఫుల్ క్లాస్ పీకార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English