తమిళనాడులో..32ఏళ్ల క్రితం ఇలాగే జరిగింది..

తమిళనాడులో..32ఏళ్ల క్రితం ఇలాగే జరిగింది..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రెండు వారాలకు పైగా హాస్పిటల్‌కే పరిమితమయ్యారు. ఆమె పాలించే స్థితిలో లేరన్న హింట్ ఇస్తూ విపక్షం తాత్కాలిక ముఖ్యమంత్రి నియామకానికి పట్టుపడుతోంది. అధికార పార్టీ మాత్రం ఆ అవసరం లేదని వాదిస్తోంది. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో 32ఏళ్ల క్రితం నాటి ఉదంతమే అందరికీ గుర్తుకొస్తోంది. అప్పుడూ ఇప్పుడూ ముఖ్యమంత్రుల తీరు, రాజకీయ పరిణామాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. అది 1984 అక్టోబర్ 5. రాత్రి పూట.. అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఊపిరి తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. భార్య జానకి, వ్యక్తిగత వైద్యుడు ఆయనను చెన్నై శివార్లలోని తమ నివాసం రామవరం గార్డెన్స్‌ నుంచి నగరంలోని అపోలో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అపోలో హాస్పిటల్ ప్రారంభమై అప్పటికి ఏడాది మాత్రమే. హాస్పిటల్‌కు వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికే అక్కడ ఉంటానని ఎంజీఆర్ భావించారు. అందుకే తన అనారోగ్య వార్తను మీడియాకు వెల్లడించవద్దని సూచించి తనతో పాటే వచ్చిన భద్రతా సిబ్బందితో పాటూ తన కార్‌నూ ఆసుపత్రి నుంచి పంపేశారు.

కొన్ని గంటల్లోనే అంతా బాగైపోతుందనుకున్న ఎంజీఆర్ మంచం పట్టారు. దీంతో అపోలో ఆసుపత్రి రాజకీయ కేంద్రమైపోయింది. రాష్ట్ర, జాతీయ నేతలు ఎంక్వైరీలు చేయడంతో పాటూ ఆయనను పరామర్శించేందుకు క్యూ కట్టారు. అప్పటి ఆరోగ్య మంత్రి హెచ్.వి. హాండే ఎప్పటికప్పుడు సీఎం ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించేవారు. ఎంజీఆర్ స్పృహలో ఉన్న కొద్ది రోజులు హాస్పిటల్‌ నుంచే విధులు నిర్వర్తించారు. అయితే అక్టోబర్ 13 నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. స్ట్రోక్ రావడంతో శరీరం కుడిభాగం బాగా ప్రభావితమైంది. మాటలోనూ తేడా వచ్చేసింది. సీటీ స్కాన్ ద్వారా ఆయన మెదడులో టెన్నిస్ బాల్ పరిమాణంలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి పక్షవాతానికి గురి కావడంతో ఆయన వారసుడిపై మల్లగుల్లాలు ప్రారంభమయ్యాయి. ఈ ఇష్యూను డీల్ చేయడం గవర్నర్‌గా ఉన్న ఎస్.ఎల్.ఖురానాకు సవాలుగా పరిణమించింది.

ప్రభుత్వంలో నంబర్‌ టు గా ప్రసిద్ధి గాంచిన అప్పటి ఆర్ధిక మంత్రి వీ.ఆర్ నెదుంచెళియన్ స్ట్రోక్ వచ్చిన ముందు రోజే ఎంజీఆర్‌ను కలిసారు. రాష్ట్ర పగ్గాలు చేపట్టాల్సిందిగా సీఎం తనకు సూచించారని ఆయన గవర్నర్‌కు వివరించారు. అయితే అదే రోజు ఖురానా కూడా ఎంజీఆర్‌ను కలిసారు. కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. దీంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియామకంపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. కొద్ది రోజుల్లోనే చికిత్స నిమిత్తం ఎంజీఆర్‌ను అమెరికాలోని బ్రూక్లిన్ హాస్పిటల్‌కు  తరలించారు. ఆ తర్వాత, సర్కార్ బాధ్యత తీసుకోవాలంటూ నెదుంచెళియన్‌కు ఎంజీఆర్‌ చెప్పారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటూ సీఎం ప్రైవేట్ సెక్రటరీ కూడా ఖురానాకు లేఖలు రాశారు. దీంతో అక్టోబర్ 25న గవర్నర్ నెదుంచెళియన్‌ను ఆపద్ధర్మ సీఎంగా నియమించారు. నెదుంచెళియన్‌ ఆధ్వర్యంలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మధ్యస్థ ఎన్నికలకూ ఆయన సిద్ధపడ్డారు. మూడు నెలల తర్వాత, అమెరికా నుంచి ఆరోగ్యంగా (పక్షవాతం కారణంగా మారిపోయిన ఆయన మాట అలాగే ఉండిపోయింది) తిరిగివచ్చిన ఎంజీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేశారు. ప్రస్తుతం తమిళనాడులోనూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియామకంపై చర్చలు సాగుతున్నాయి. జయలలిత విధేయుడు పన్నీర్ సెల్వం పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే, పురచ్చి తలైవి కూడా నాటి తలైవాలా కోలుకుని రాష్ట్రాన్ని నడిపించాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.