కార్‌ నంబర్‌కు అక్షరాలా రూ.60కోట్లు

కార్‌ నంబర్‌కు అక్షరాలా రూ.60కోట్లు

ఫ్యాన్సీ నంబర్‌లో ఏముందో తెలీదు కానీ సదరు సంఖ్యలను వశం చేసుకునేందుకు జనాలు తెగ పోటీపడిపోతుంటారు. మోజు పడ్డ నంబర్ సిరీస్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు. ఇక కోటీశ్వర్లు, కుబేరులైతే లక్షలు లక్షలు కుమ్మరించేస్తారు. కానీ బల్వీందర్ సహానిలా డబ్బును ధార పోస్తారని మాత్రం ఊహించలేం. అసలింతకీ బల్వీందర్ ఏం చేశాడనేగా మీ సందేహం. తన రోల్స్ రాయిస్ కార్ నంబర్ కోసం ఏకంగా రూ.60కోట్లు ఖర్చు చేశాడు.

దుబాయ్‌లో నివసించే భారతీయ వ్యాపారి బల్వీందర్‌ సహాని తన రోల్స్‌రాయిస్‌ కారుకు 5 అంకెను నంబర్ ప్లేట్‌గా పెట్టుకునేందుకు (డి 5) 3.30 కోట్ల దిర్హామ్‌లు (9 మిలియన్‌ డాలర్లు లేదా సుమారు రూ.60 కోట్లు) చెల్లించాడు. ఇదే కాక మరో కారు కోసం కూడా ఆయన 10 లక్షల దిర్హామ్‌లు (సుమారు రూ.1.81 కోట్లు) ఇచ్చేశాడు. మొత్తం 80 నంబర్ ప్లేట్స్ కోసం నిర్వహించిన వేలంలో పలు ఫ్యాన్సీ సంఖ్యలను అందుబాటులో ఉంచారు ఆక్షన్ నిర్వాహకులు. బల్వీందర్ సొంతం చేసుకున్న డి-5 కోసం 2 కోట్ల దిర్హామ్‌ల వద్ద వేలం మొదలైంది.

బల్వీందర్ దుబాయ్‌లో ఆర్‌ఎస్‌జీ ప్రాపర్టీ సంస్థ అధిపతి. అక్కడంతా ఆయనను అబు సబాగా వ్యవహరిస్తారు. గత ఏడాది కూడా ‘9’ సంఖ్య కోసం బల్వీందర్ 2.50 కోట్ల దిర్హామ్‌లు (సుమారు రూ.47 కోట్లు) చెల్లించినట్లు గల్ఫ్‌న్యూస్‌ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. 1 నుంచి 9 లోపు నంబర్స్‌ను పొందడానికి యూఏఈ సంపన్నులు పోటీ పడుతుంటారు. ఆ సంఖ్యలు తమ హోదాకు చిహ్నమని భావిస్తుంటారు. 2008లో ఎమిరేట్ వ్యాపారవేత్త సయ్యద్‌ అల్‌ ఖౌరీ ‘1’ నంబర్ కోసం చెల్లించిన 5.22 కోట్ల దిర్హామ్‌లు (సుమారు రూ.95 కోట్లు) రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు