లోకేశ్‌ను ఎంత హర్ట్ చేసేశావ్ జ‌గ‌న్‌?

లోకేశ్‌ను ఎంత హర్ట్ చేసేశావ్ జ‌గ‌న్‌?

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య నెల‌కొన్న వార్ బ‌హిరంగ లేఖ‌లు రాసే స్థాయికి చేరింది. తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించిన స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప‌ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అవ‌మానించ‌ట్లు సాక్షిలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌లు వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి లోకేష్ బ‌హిరంగ లేఖ రాశారు. సాక్షి పత్రికలో అవాస్తవాలు, అభూతకల్పనలు ప్రచురిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సాక్షిలో నిన్న వచ్చిన కథనాలతో అవాస్తవాలు ప్రచురిస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. వైఎస్‌తో పనిచేసిన సీనియర్‌ నాయకులు, మంత్రులను అవమానపరిచిన చరిత్ర జగన్‌దేనని లోకేశ్‌ మండిపడ్డారు. లోకేశ్ లేఖలోని అంశాల‌ను ఇవి.

"వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి  నమస్కారములతో. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రికలో కథనాలు ఎంత అవాస్తవమో, అభూతకల్పనలో 7-10-2016న ప్రచురించిన వార్త ద్వారా మరోసారి స్పష్టమైంది. నేను, మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్పగారు ఉన్న ఫొటోకు మీ పత్రికలో వక్రభాష్యాలు జోడించి నిరాధార వార్తలు ప్రచురించడం పత్రికా విలువలను, రాజకీయ విలువలను దిగజార్చడం కాదా?  సాక్షి రాసింది వక్రభాష్యం కాదనడానికి మీ వద్ద ఏ ఆధారాలున్నాయి? అబద్దాలు ప్రచురించి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు మీరు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి మీ గౌరవం కాపాడుకోవాలి. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను తెలుగుదేశం పార్టీ వర్క్షాపులో "కోర్ డ్యాష్బోర్డ్ పై ప్రజంటేషన్" ఇస్తున్న సమయంలో కూన రవికుమార్ గారు వెలిబుచ్చిన అభిప్రాయానికి నేను, పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్పగారు వివరణ ఇస్తూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశాము. ఇందులో నేను బెదిరించడం, చినరాజప్పగారు భయపడడం అనే దానికి ఆస్కారమే లేదు. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలున్నాయి. పైగా అది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీల‌ సమక్షంలో జరిగింది. అందరూ ప్రత్యక్ష సాక్ష్యులే. మీ సాక్షి పత్రిక వక్రభాష్యం చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. నా వ్యక్తిత్వాన్నిహననం చేయాలనే మీ అసూయ, విద్వేష రాజకీయాలకు మీరే నగుబాట్లపాలౌతున్నారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుందిగాని నాపై దుప్రచారం చేస్తే, నన్ను చూసి అసూయపడితే మీకు భవిష్యత్తు ఉండదు. పెద్దల్ని సహచరుల్ని గౌరవించడం నాకు నా తల్లిదండ్రులు నేర్చిన సంప్రదాయం. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేలా నేను వ్యవహరించను, వ్యవహరించబోను. వైద్యం చేయించుకొంటూ వర్క్షాప్కు రాలేకపోతే దాన్ని వక్రీకరిస్తారా? నాకు, నా తండ్రికి విబేధాలున్నట్లు దుప్రచారం చేశారు. మీలాగా నేను తండ్రిని, తల్లిని, చెల్లిని, చిన్నాన్నను అవమానపరచను" అంటూ ఫైర్ అయ్యారు.

త‌న‌పైన, పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్పగారిపైన దుప్రచారం చేసినందుకు సాక్షి పత్రిక తరపున వైఎస్ జ‌గ‌న్‌ బహిరంగ క్షమాపణ చెప్పి తప్పిదాన్ని సరిచేసుకోవాల‌ని లోకేశ్ డిమాండ్ చేశారు. దుప్రచార రాజకీయాలు మాని నిర్మాణాత్మక రాజకీయాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు