టీడీపీ ఇంకెప్పుడు తెలుసుకుంటుందో!

టీడీపీ ఇంకెప్పుడు తెలుసుకుంటుందో!

ప్ర‌తిప‌క్ష పార్టీ అంటే ఎలా ఉండాలి? స‌డ‌ల‌ని ప‌ట్టుతో అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టేలా ముందుకు సాగాలి. కానీ సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు సార‌థ్యంలోని టీడీపీలో ఇదే కొర‌వ‌డింద‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త‌ జిల్లాల విష‌యంలో కీల‌క ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ వైఖ‌రి గంద‌ర‌గోళంగా ఉంద‌నేది తేట‌తెల్లం అవుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. జిల్లాల విభ‌జ‌న‌పై టీడీపీ జాతీయ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను త‌మ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌తో పోల్చేయ‌గా...టీడీపీ అధికార ప్ర‌తినిధి న‌ర్సిరెడ్డి  మాత్రం కేసీఆర్‌ను తీవ్రంగా దుయ్య‌బ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

నల్లగొండ జిల్లాలో ఉన్న యాదాద్రిని జిల్లాగా ప్రకటించినందుకు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ శిష్యుడిగా పేరు తెచ్చుకోవాలని కేసీఆర్ ఆలోచించడం సంతోషమేన‌ని అన్నారు. ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ మండలాలు ఏర్పాటుచేయ‌గా ఎన్టీఆర్ బాటలోనే కేసీఆర్ నడుస్తూ మెరుగైన రీతిలో జిల్లాలు ఏర్పాటు చేశార‌ని మోత్కుపల్లి అభినందించారు. ఈ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు మరోడిమాండ్ కూడా ఉంచారు. దసరా నాడు ఎవరినీ బాధ పెట్టనన్న కేసీఆర్, చరిత్ర గలిగిన ఆలేరును రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి కేసీఆర్ తన ఉదారత చాటుకోవాలని సూచించారు.

ఇదిలాఉండ‌గా అయితే, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్శిరెడ్డి మాత్రం జిల్లాల ఏర్పాటుపై అందుకు భిన్నంగా స్పందించి, కేసీఆర్ తీరును తూర్పారపట్టారు. 'ఇది ప్రజల అవసరాల కోసమా? కేసీఆర్ అదృష్ట సంఖ్య కోసం జిల్లాలు పెడుతున్నారా? దీనికి శాస్త్రీయ‌త లేదు. ఇదంతా రాజకీయావసరాలు, కుట్ర, ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే చేస్తున్నారు. దీన్ని సొంత వ్యవహారంగా మార్చారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలి. అధికారులను క్షేత్రస్థాయికి పంపకుండా, ప్రతిపక్షాల సలహాలు తీసుకోకుండా మీ కుటుంబం ద్వారానే రాష్ట్రం వచ్చిందన్న భావన కల్పిస్తున్నారు' అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఒకేపార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే అంశంపై విభిన్నంగా మాట్లాడటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

టీడీపీ అధికార ప్ర‌తినిధి న‌ర్సిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై మోత్కుపల్లి స్పందిస్తూ 'యాదాద్రి కోసం నేను, మా పార్టీ పోరాటం చేశాం. జిల్లా ఇచ్చి మంచిపనిచేసినందుకు అభినందించా. గతంలో సరైన నిర్ణయాలు తీసుకోనందుకు విమర్శించా కదా? మంచిని మంచి, చెడును చెడుగా చెప్పాలి. కేసీఆర్ ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటాననడం మంచిదే కదా? అలాగే ఆలేరును డివిజన్‌గా చేయమని కోరా. ఇందులో తప్పేముంది? నా అభిప్రాయం నేను చెప్పాను' అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఒకే పార్టీ భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తోంద‌నే పేరు ఉన్నందుకే ఇఆ తాము పలుచ‌న అయిపోతున్నామంటూ సాక్షాత్తు టీడీపీ శ్రేణులే వాపోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు