జగన్ ముందుకు ప్రత్యేక డిమాండ్ వస్తోంది!

జగన్ ముందుకు ప్రత్యేక డిమాండ్ వస్తోంది!

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో దూకుడు పెంచుతూ ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముందు కొత్త డిమాండ్ వస్తోంది. జగన్ తన పోరాటంతో శ్రేణుల్లో ఉత్సాహం పెంచుతున్నప్పటికీ దీన్ని మరింతగా పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందనే భావన సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. ప్రత్యేక పోరులో ప్రజలందిరినీ సమన్వయం చేసేందుకు వై.ఎస్.జగన్ తనతోపాటు తన మాతృమూర్తి వై.ఎస్.విజయమ్మను, చెల్లెలు షర్మిళ్లను రంగంలోకి దించితే ఏకకాలంలో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేయడం మరింత సులువు అవుతుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించుకోవడం వెనక మొత్తం వై.ఎస్ కుటుంబం కష్టం, శ్రమ దాగున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో జగన్ జైలు లో ఉండటంతో ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ్ల మొత్తం ఎన్నికల బాధ్యతలను భుజాన ఎత్తుకొన్నారు.జగన్ జైలులోనున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న వై.ఎస్.విజయమ్మ, షర్మిళ్ల ఇప్పుడు పార్టీలో ఎందుకు కనిపించడంలేదు...? జగన్ తిరిగొచ్చాక వారి పాత్ర నామమాత్రంగా ఎందుకు మారింది...? వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వారు మళ్లీ తెరపైకి వస్తారా అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న చర్చ. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ నాడు తాను జైలులో ఉన్న సమయంలో పార్టీ అవసరాల కోసం ఆయన ఆదేశానుసారం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ్ల జనంలోకి విస్తృతంగా వెళ్లారు. ఇప్పుడు జగనే స్వయంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవడం వల్ల తల్లి, చెల్లి అవసరం ప్రస్తుత పార్టీకి అంతగా అవసరంలేదని జగన్ సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.

జగన్ అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని జనంలో ప్రత్యేక ముద్ర ఉన్నా ఆ పార్టీలో నెంబర్ టూ స్థానంలో జనాకర్షణ ఉన్న నేతలు దివంగత నేత వైఎస్ సతీమణి వై.ఎస్.విజయమ్మ, కూతురు షర్మిళ్ల మాత్రమేనని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం సెంటిమెంటుగా మారుతోందని, దీనిపై పోరాటం చేస్తూ ప్రతి పార్టీ పేటెంట్ కోసం పాట్లు పడుతోందని వైసీపీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ ముందున్నా మరింత జనం ఆమోదం పొందాలంటే ఈ హోదా పోరులో వై.ఎస్. విజయమ్మ, షర్మిళ్ల భాగస్వామ్యమైతే తక్కువ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని మరింత చైతన్యం చేయోచ్చని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుడే ప్రత్యే కహోదాపై ఏకైక పేటెంట్ వైసీపీకే దక్కుతుందని ఆ పార్టీ వర్గాల మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు