కేసీఆర్ మ‌ళ్లీ గెలిచాడోశ్‌

కేసీఆర్ మ‌ళ్లీ గెలిచాడోశ్‌

కేసీఆర్‌..టీఆర్ఎస్ అధినేత‌గా త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేక రాజ‌కీయాలు చేసే వ్యూహ‌క‌ర్త అన‌డంలో సందేహం లేదు. ఇపుడు జిల్లాల ఏర్పాటులోనూ కేసీఆర్ అదే త‌ర‌హాలో పావులు క‌దిపార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. విప‌క్షాల‌ను ప‌రిమిత స్థాయికే కుదించ‌డంతో ఇది స్ప‌ష్ట‌మైంద‌ని చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంటే తేనె తుట్టెను కదపడమే అనే భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ జోలికి వెళ్లలేదు. దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు జిల్లాల పునర్విభజన చేశాయి. కానీ కేసీఆర్ కొత్త రాష్ట్రంలో ఆ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌డమే కాకుండా వివ‌ప‌క్షాలను ఇరుకున ప‌డేసేలా నిర్ణ‌యం తీసుకున్నార‌నేది ప్ర‌స్తుత టాక్‌.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచే తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని కేసీఆర్ చెబుతూ వచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటును దృష్టిలో పెట్టుకుని పార్టీకి సంబంధించి ఆదిలాబాద్, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో రెండేసి జిల్లాల కమిటీలను కూడా నాలుగేళ్ల నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో సైతం కొత్త జిల్లాల ఏర్పాటు గురించి హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం కాగానే విపక్షాలు ఈ అంశంపై దృష్టి సారించాయి. రాజకీయ కోణంతో, లక్కీ నంబర్ పేరుతో జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కుమారుడి కోసం సిరిసిల్లను జిల్లా చేస్తున్నారని, అల్లుడికో జిల్లా, కూతురికో జిల్లా అని విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ ఇక్క‌డే ట్విస్ట్ ఇచ్చారు. డ్రాఫ్ట్ ముసాయిదాలో జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ప్రతిపాదన లేకపోవడంతో జిల్లాల ఏర్పాటు ఉద్యమం మొత్తం ఈ మూడు ప్రాంతాల్లో కేంద్రీకృతం అయింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం తరువాత విపక్షాలు ప్రధానంగా జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు నిర్వహించాయి.

కొత్త జిల్లాల అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంపై దృష్టిసారించి ఈ మూడు ప్రాంతాల్లోనే ప్ర‌తిప‌క్షాల త‌ర‌ఫున‌ పెద్ద ఎత్తున ఆందోళనలు జరగ‌డం ఆస‌క్తిక‌రం. ముఖ్యమంత్రి కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలు ఆందోళన ఉధృతంగా సాగించి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గద్వాల కోసం డీకే ఆరుణ నాయకత్వంలో గద్వాలలో, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరకు తాను ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే గద్వాలను జిల్లా చేయడం లేదని ఆరోపిస్తూ డీకే అరుణ ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ పంపించారు. మరో వారం రోజుల్లో కొత్త జిల్లాలు అమలులోకి రానుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా గద్వాల, సిరిసిల్ల, జనగామలను కూడా జిల్లాలను చేస్తున్నట్టు పార్టీ నేతలకు వెల్లడించారు. రెండు రోజుల పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం మేరకు ఈ మూడు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చివరి దశలో తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త జిల్లాల అంశంలో విపక్షాలు ఆందోళన చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. చివరకు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌ను చేయాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై విపక్షాల దృష్టి మొత్తం ఈ మూడు ప్రాంతాలపైనే కేంద్రీకరించిన సమయంలో గద్వాల, సిరిసిల్ల, జనగాంల ప్రకటనను ముఖ్యమంత్రి చేశారు. ఈ ఎపిసోడ్‌లో గ‌తంలో టీడీపీ, అనంత‌రం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ చేయ‌లేని నిర్ణ‌యాన్ని కేసీఆర్ తీసుకున్న‌ట్ల‌యింది. అదే స‌మ‌యంలో కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించి చివరి వరకు జిల్లాల సంఖ్యను బయట పెట్టలేదు. తొలుత 24 జిల్లాలు అని చెప్పగానే ముఖ్యమంత్రి లక్కీనంబర్ 6కాబట్టి 24 జిల్లాలు అనే విమర్శ వచ్చింది. తరువాత 26 జిల్లాలు అనే ప్రచారం జరిగింది. 27 జిల్లాలతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణతో దాన్ని ఇప్పుడు 30కి పెంచారు. ఇంత కీలకమైన అంశంలో విపక్షాల విమ‌ర్శ‌ల‌ను నిర్వీర్యం చేసే విధంగా జిల్లాల ఏర్పాటుపై ఊహించని నిర్ణయం తీసుకొని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను కేసీఆర్‌ డైలమాలో పడేశారని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు