బాబు ఖాతాలో ఇంకో ప్ర‌త్యేక రికార్డు

బాబు ఖాతాలో ఇంకో ప్ర‌త్యేక రికార్డు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మ‌ధ్య కొత్త త‌ర‌హా రికార్డులు సాధిస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌లే పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన సీఎం చంద్ర‌బాబు ప్రాజెక్టు పనుల ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రం కోసం ఒక‌రోజు అంటూ ప్ర‌క‌టించేశారు. ఇపుడు అదే రీతిలో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం ఇంకో రోజును చంద్ర‌బాబు ప్ర‌క‌టించేశారు.

అమరావతి నిర్మాణంపై ఉండవల్లిలోని త‌న‌ నివాసంలో మున్సిపల్‌ శాఖ మంత్రి పి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు  సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ అమరావతిలో నిర్మాణాలు, రహదారులు అద్భుతంగా ఉన్నాయని ప్రజలు కీర్తించేలా ఉండాలని సూచించారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆర్కిటెక్చర్లను గుర్తించి, వారి సహకారంతో ఉత్తమ భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. నిర్మాణంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసి వారి ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నాణ్యత, మౌలిక సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.న‌వ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అందుకోసం ఇక నుంచి ప్రతి బుధవారం అమరావతిపై సమీక్షిస్తూ పనులు వేగంగా జరిగేలా కషి చేస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రియల్‌ ఎస్టేట్‌ కాదని చంద్ర‌బాబు తెలిపారు. రాజధాని నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఎప్పటికప్పుడు చేపడుతున్న పనులు, ప్రగతిని ప్రజలకు వివరించేందుకు సీఆర్‌డీఏ అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమరావతిలో కాలుష్యరహిత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు మాస్టర్‌ ప్రణాళికను రూపొందించాలన్నారు. సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, చర్చాకార్యక్రమాల ద్వారా ప్రజలను రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేయాలని బాబు సూచించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సమావేశ మందిరం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఫర్నిచర్‌, ఇతర సౌకర్యాలపై సమీక్షించారు. అంతకుముందు సిఆర్‌డిఎ కమిషనర్‌ శ్రీధర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అమరావతిలో నిర్మించనున్న నాలుగు, ఆరువరుసల రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వివరించారు. వారంలో ఒక్కో అవ‌స‌రం, సంద‌ర్భానికి ఒక్కో రోజును ప్ర‌క‌టించ‌డం ద్వారా చంద్ర‌బాబు మ‌రో రికార్డును సాధించార‌ని ప‌లువురు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు