ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యామిలీ ప్యాక్

ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యామిలీ ప్యాక్

ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఉప్మా మీద బతికేస్తుందా నాన్న? అంటూ మహేష్ బాబు డైలాగ్ అందరికీ గుర్తుండేదే. ఇంచుమించు అలాంటి పరిస్థితే వైఎస్ ఫ్యామిలీలో కనిపిస్తుంది. సమన్యాయం అన్న ముసుగులో సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నట్లు తెగ బిల్డప్ ఇస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అడుగులు వ్యూహాత్మంగా మొదలయ్యాయి. మొదట పార్టీ నేతల చేత రాజీనామా చేయించారు. కానీ.. అవేమీ ఇప్పటివరకు రాజీనామా ఆమోద ముద్ర పడలేదు. అనంతరం.. జగన్, విజయమ్మలు తమ పదవులకు రాజీనామా చేశారు. వాటికీ ఆమోదముద్ర పడలేదు. తర్వాత గుంటూరులో విజయమ్మ నిరశన దీక్ష చేశారు. ఆమె ఆరోగ్యం అస్సలు బాగోలేదని పోలీసులు దీక్ష భగ్నం చేశారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స చేస్తున్నామని వైద్యులు ప్రకటించారు. చిత్రంగా.. రెండో రోజుకి ఆమె ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మొత్తమ్మీదా ఢిల్లీలో కాస్త హడావుడి చేశారు.

అంతలోనే జగన్ బాబు దీక్ష వార్త బయటకు వదిలారు. సమన్యాయం కోసం జగన్ జైల్లోనే దీక్ష చేపట్టారంటూ హడావుడి చేశారు. అంతే.. ఆ ప్రకటన వెలువడి వెంటనే.. జగన్ అబిమానులు వందలాదిగా జైలు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తే..పోలీసులు వాటిని భగ్నం చేశారు. జైలు ముందు ముళ్ల కంచె వేశారు. అదనపు బలగాలను మొహరించారు. అప్పటి నుంచి వార్తల్లోకి జగన్ వచ్చేశాడు. జైలు గదిలో వెలుతురు, గాలి సరిగా లేకపోవటం వల్ల చాలా తొందరగా అలిసిపోయాడంటూ ఐదో రోజు దీక్షఃను విరమించాల్సిందిగా జగమొండి జగన్ ఒప్పుకోకపోయేసరికి ఆయన్ను ఆసుపత్రికి చేర్చారు. జగన్ పత్రిక సాక్షిలో అయితే.. ఐదు రోజులు కాదు ఐదున్నర రోజులు అంటూ.. విశ్లేషణతో కూడిన మూడు కాలాల వార్తను పరిచారు. మరోవైపు.. వైద్యుల పర్యవేక్షణలో జగన్ బాబు దీక్ష కొనసాగిస్తున్నారు. జైల్లో దీక్ష చేస్తున్న జగన్.. అస్వస్థతతో ఆసుపత్రికి చేరుకునే సమయానికి.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మరో ప్రకటన.

ఆ పార్టీ తురుపుముక్కగా భావించే షర్మిల బస్సు యాత్రతో రంగప్రవేశం చేశారని. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం విశ్రాంతి తీసుకున్న ఆమె.. సమన్యాయం అనబడే.. సమైక్యాంధ్ర నినాదాన్ని బస్సుకెత్తుకొని.. యాత్ర చేయబోతున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇందుకు ముహుర్తం సెప్టెంబర్ 2తేదీగా నిర్ణయించారు. ఉద్యమంలో ఉన్న సీమాంధ్ర ప్రజానీకం తమను నమ్మరేమోనన్న అపనమ్మకంతో.. ముందస్తుగా.. తమ అడ్డా అయిన కడప జిల్లా నుంచి యాత్రను మొదలుపెడుతున్నారు. ఇలా.. ఉద్యమం పేరుతో ఫ్యామిలీ.. ఫ్యామిలీ బతికేయటం రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ కే దక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు