పాకిస్థాన్ కు షాకిచ్చిన చైనా

పాకిస్థాన్ కు షాకిచ్చిన చైనా

చైనా అంటే భారత్ వ్యతిరేకి... పాకిస్థాన్ కు సహాయం చేస్తుందన్న ముద్ర ఉంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలే భారత్ లో అధికం. అందుకు తగ్గట్లుగానే ఇటీవల తరచూ సరిహద్దుల్లో చైనా నుంచి అతిక్రమణలు ఉంటుండడంతో ఆ దేశంపై ఒకరకమైన ముద్ర పడిపోయింది. ఆ నేపథ్యంలోనే మొన్న యూరీలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ ల మధ్య యుద్ధం రావొచ్చన్నంత పరిస్థితి ఏర్పడినప్పుడు చైనా పాక్ కు అండగా ఉంటుందన్న ప్రచారం మొదలైంది. పాక్ లో చైనా రాయబారి కూడా అదే మాట చెప్పారంటూ వార్తలొచ్చాయి. అది నిజమో కాదో తెలియదు కానీ... అంతర్జాతీయంగా ఆ వార్త ప్రచారం కావడంతో పాక్ మరింత రెచ్చిపోయింది. చైనా తమకు అండగా ఉందన్న ధైర్యమో, పొగరో కానీ భారత్ తో యుద్దానికి రెడీ అంటూ ప్రకటనలు చేసింది. కానీ... చైనా మాత్రం తాజాగా పాక్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. మా రాయబారి మాటలతో మాకు సంబంధం లేదు... పాక్ ఎంతో ఇండియా కూడా తమకు అంతే అని చెప్పడంతో పాకిస్థాన్ కు హార్ట్ అటాక్ వచ్చినంత పనైందట.

మరో దేశంతో యుద్ధం వస్తే పాక్ కు చైనా అండగా వుంటుందని పాక్ లో చైనా రాయబారి యు బోరెన్ చెప్పినట్టు వచ్చిన వార్తలను చైనా విదేశాంగ శాఖ కొట్టి పారేసింది. యు బోరెన్ వ్యాఖ్యలపై తమకు సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఇండియా, పాకిస్థాన్ రెండూ తమకు పొరుగున ఉన్న మిత్రదేశాలని, ఈ దేశాల విషయంలో తమ విధానం అత్యంత స్పష్టమని, విభేదాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని సూచించింది.

కాగా పాక్ విషయంలో అంతర్జాతీయంగా భారత్ కే మద్దతు లభించడం... ఐరాస జనరల్ బాడీ మీటింగులో పాక్ ఏకాకి కావడం.. అక్కడ మన విదేశాంగ మంత్రి సుష్మ ప్రసంగానికి మద్దతు దొరికిన నేపథ్యంలో చైనా కూడా పాక్ కోసం అంతర్జాతీయంగా తానూ అందరికీ వ్యతిరేకం కారాదన్న ఉద్దేశంతో కాస్త ఆచితూచి వెళ్తున్నట్లు భావిస్తున్నారు. కారణం ఏదైనా చైనా తన స్టాండ్ మార్చుకోవడంతో పాక్ విస్తుపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు