ఆ కల వదిలేసుకోండి-పాక్‌కు సుష్మ వార్నింగ్

ఆ కల వదిలేసుకోండి-పాక్‌కు సుష్మ వార్నింగ్

జమ్ముకాశ్మీర్‌ కోసం పాకిస్తాన్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తోంది. స్వర్గం లాంటి కాశ్మీర్ లోయలో రక్తపుటేరులు పారిస్తోంది. ఉగ్రవాద మూకలను ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాలు తోడేస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై గతంలో ఎన్నోసార్లు చెప్పినా.. యురీ దాడి నేపథ్యంలో నేతల వాణిలో తీవ్రత పెరిగింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతనిధుల సభలో మాట్లాడిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ఏళ్ల తరబడి కాశ్మీర్‌లో హింసను రెచ్చగొడుతున్న వైఖరిని ఎండగట్టారు. కాశ్మీర్‌ను భారత్‌ను విడగొట్టాలన్న కలను వదిలేయండి అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. జమ్ముకాశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని అది ఎప్పటికీ అలాగే ఉంటుందని తేల్చిచెప్పారు.

తీవ్రవాదాన్ని అతి పెద్ద మానవహక్కుల ఉల్లంఘనగా సుష్మ అభివర్ణించారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న వారినే దీనికి బాధ్యులను చేయాలని స్పష్టంచేశారు. పొరుగుదేశానికి తాము స్నేహ హస్తం చాస్తే.. వారు మాత్రం ఉగ్రదాడులతో సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏకీకృత విధానంతోనే ప్రపంచదేశాలు తీవ్రవాదాన్ని ఓడించగలవని అన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించే వారిని ఏకాకులుగా చేయాలని పిలుపునిచ్చారు.

కాశ్మీర్‌లో భారత్‌ దళాలు యథేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని, వాటి ఫలితంగానే నెల రోజులుగా అక్కడ అల్లర్లు కొనసాగుతున్నాయని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐరాసలో పేర్కొన్నారు. ఈ కారణంతోనే యురీలో సైనికులపై దాడి జరిగిందని.. తమను బాధ్యులను చేయడం తగదని మొసలి కన్నీరు కార్చారు. దీనిపై సుష్మ తీవ్రంగా స్పందించారు. బలోచ్ తెగ ప్రజలపై పాక్ దాష్టీకాన్ని గుర్తుచేశారు. అక్కడ మానవహక్కుల ఉల్లంఘన వికృత రూపం దాల్చిందని అన్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ స్వతంత్ర ప్రతిపత్తి కోసం ఏళ్లుగా పోరాడుతోంది. బలోచ్ ప్రజల కోసం పోరాడుతున్న నేతలను పాక్ ప్రభుత్వం దారుణంగా హత్యలు చేయించింది. వారి తరపున వాణి వినిపించే మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులనూ మృత్యుఒడికి చేర్చింది.