కేసీఆర్ కంటే రోశ‌య్య మేలంట‌

కేసీఆర్ కంటే రోశ‌య్య మేలంట‌

రాష్ట్ర వ్యాప్తంగా ఏక‌దాటిగా వర్షాలు పడి వాగులు, వంకలు, చెరువులు తెగి ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డిన నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వైఖ‌రిపై తెలుగుదేశం పార్టీ విరుచుకుప‌డింది.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి చూస్తుంటే ఆయ‌న కంటే వృద్ధుల వైఖ‌రి మెరుగు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.  భాగ్యనగరం అభాగ్య నగరమై, విశ్వనగరం వికృత నగరమై ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ విపత్క‌ర‌ సందర్భాలలో సచివాలయంలో కూర్చొని సమీక్ష చేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నూతన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేన‌ని దుయ్య‌బ‌ట్టారు. 2009 సంవత్సరంలో అసమర్ధ ముఖ్యమంత్రి అని పేరు ఉన్న అప్ప‌టి సీఎం రోశయ్య 80 ఏళ్ల వయసులో కూడా  శ్రీశైలం విపత్తును సచివాలయంలో రెండు రోజులు నిద్రకూడా లేకుండా ఉండి మానిటరింగ్ చేసి సహాయక చర్యలు చేపట్టారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. అయితే ప్ర‌స్తుతం కేసీఆర్ చేస్తున్నది ఏమిటని ప్ర‌శ్నించారు.

నూతన ప్రభుత్వం యొక్క పాలన విధానాన్ని చూస్తే ఎంత అసమర్థంగా ఉందో వాళ్లు చేస్తున్న పనులను చూస్తే అర్థమవుతుందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సెక్రటేరియట్ కు వస్తే అది బ్రేకింగ్ న్యూస్ వ‌లే, మాట్లాడితే అది షాకింగ్ న్యూస్ వ‌లే ప్రజలకు అనిపిస్తోంద‌ని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. బ్రేకింగ్, షాకింగ్ న్యూస్‌ల‌తో ప్రజలను కేసీఆర్ గందరగోళం చేస్తున్నారని మండిప‌డ్డారు. "వర్షాలు పడి ప్రాజెక్టులు నిండితే అది త‌మ‌ ఘనతే అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చేబట్టి నిర్మించిన ప్రాజెక్టు, చెరువు ఒక్కటైనా ఉందా? సమస్య వస్తే గత పాలకుల వల్ల అని చెప్పేవారు గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టులే నిండాయని చెప్పవచ్చు కదా?"అని పెద్దిరెడ్డి నిల‌దీశారు. నకిలీ పనులు జరిగాయని, సంబంధిత మంత్రే మాట్లాడుతుంటే.. దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలని ప్ర‌శ్నించారు. అక్రమ కట్టడాలపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటో ప్రకటించాలి. పరిస్థితులు చక్కబడే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.