సీమ‌లో టీడీపీ స‌రికొత్త రికార్డు

సీమ‌లో టీడీపీ స‌రికొత్త రికార్డు

2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా నిరంతరం క‌ష్ట‌ప‌డుతున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు.. ఈ క్ర‌మంలో టీడీపీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయ‌డం, టీడీపీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తోందో వివ‌రించ‌డం.. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవ‌డం, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం వంటి కీల‌క విష‌యాల‌పై ప‌ట్టు సాధించి వాటిని సాకారం చేస్తేనే టీడీపీ బ‌లంగా ఉంటుంద‌ని, ప‌శ్చిమ బెంగాల్‌లో వామ‌ప‌క్షాలు సృష్టించిన రికార్డును బ్రేక్ చేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని గుర్తించారు. అయితే, ఇంత పెద్ద వ‌ర్క్‌.. తానొక్క‌డి వ‌ల్లా సాధ్యం కాద‌ని ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆలోచ‌న‌ల నుంచి ఉద్భ‌వించిందే ప‌సుపు సైన్యం! ప్ర‌తి జిల్లాలోనూ నూత‌నంగా సుశిక్ష‌తులైన టీడీపీ సైన్యాన్ని త‌యారు చేయాల‌ని, వారి ద్వారా అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని ప‌క్కాప్లాన్ సిద్ధం చేసిన చంద్ర‌బాబు ఏడాది కిందట దీనిన అమ‌ల్లో కూడా పెట్టేశారు. ఈ బాధ్య‌త‌ల‌ను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, త‌న కుమారుడు నారా లోకేష్‌కి అప్ప‌గించారు. దీంతో ఈ యువ నేత త‌నస్టైల్‌లో టీడీపీకి కొత్త సైన్యాన్ని త‌యారు చేయ‌డంలో అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించారు. దీని ఫ‌లితంగా ఇప్పుడు రాయ‌ల‌సీమ‌లో ఆరు వేల మంది సుశిక్షితులైన టీడీపీ సైన్యం త‌యారైంది. తిరుప‌తి కేంద్రంగా ప్రారంభించిన టీడీపీ శిక్షణా కేంద్రానికి ఔత్సాహిక యువ‌త పోటెత్తారు. అయితే, వారిని ఇంట‌ర్వ్యూ చేసి మ‌రీ ఈ శిక్ష‌ణ‌కు ఎంపిక చేశారు.

గ‌త ఏడాది సెప్టెంబ‌రు 11 న ప్రారంభ‌మైన శిక్ష‌ణ ఈ ఏడాది సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు సాగింది. ఈ ఏడాది కాలంలో వారికి రాజ‌కీయ పాఠాల‌తోపాటు ప్ర‌జ‌ల‌లో టీడీపీ ప‌ట్ల మ‌రింత సానుభూతి సంపాదించేలా, ప్ర‌భుత్వం ఉన్న‌ది ప్ర‌జ‌ల కోస‌మే అనే భావన క‌లిగించేలా.. కూసింత క‌లుపుగోలుగా ప్ర‌జ‌ల్లో తిరుగుతూ.. వారి మ‌నోభావాల‌ను ప‌సిగ‌డుతూ.. ప్ర‌భుత్వానికి ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేసేలా విభిన్న అంశాల‌పై క‌ఠోర‌మైన శిక్ష‌ణ ఇచ్చారు. ఈ శిక్ష‌ణ పొందిన వారిలో గ్రాడ్యుయేట్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.  ఫలితంగా శిక్షణ ముగించుకున్న ప్రతి కార్యకర్తా పార్టీకి కనీసం మండల స్థాయి నాయకుడుగా ఉపయోగపడే రీతిలో తయారవుతున్నాడు. ప్రతి బ్యాచ్‌లోనూ శిక్షణానంతరం వివిధ అంశాలపై ప్రసంగించమని పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు కూడా అందిస్తున్నారు.

మ‌రోప‌క్క‌, ఈ శిక్ష‌ణ మొత్తం లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనే సాగ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఇప్పుడు రాయ‌ల‌సీమ‌లో ఆరు వేల మంది సుశిక్షిత సైన్యం టీడీపీకి స‌మ‌కూరింది. మ‌రోప‌క్క, ఇక్క‌డే వైకాపాని పూర్తిస్థాయిలో దెబ్బ‌తీయాల‌ని చంద్ర‌బాబు వ్యూహంతో ఉన్నారు. ముఖ్యంగా క‌డ‌ప‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున సైకిల్ స‌వారీ చేయించేలా ఆయ‌న ఇప్ప‌టి నుంచే స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో సీమ శిక్ష‌ణా కేంద్రానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు వీరిని క్షేత్ర‌స్థాయిలోకి పంపి.. ఫ‌లితంగా రాబ‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఏదేమైనా.. టీడీపీ ప‌క్కా వ్యూహంతో వేస్తున్న అడుగులు.. వైకాపా నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు