బాబు ఫైర్‌ః నాకు ఇంగ్లిష్‌ రాదంటావా?

బాబు ఫైర్‌ః నాకు ఇంగ్లిష్‌ రాదంటావా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ నిర్వహించిన యువబేరీ సదస్సులో ముఖ్యమంత్రి తీరుపై జగన్‌ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు అసహనం వ్యక్తం చేశారు. అజ్ఞానాన్ని ప్రదర్శించి ప్రజల్లో మరింత చులకన కావొద్దంటూ ఎద్దేవా చేశారు. నాకు ఇంగ్లీష్‌ రాదంటావా అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లు చంద్రబాబు చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే రక్తం తనది కాదని చంద్రబాబు అన్నారు. రోజూ 18గంటలు పనిచేస్తున్నానని, ఆరుగంటలే నిద్రపోతున్నానని పేర్కొంటూ  నీతివంతమైన పాలననందిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. తనది ఉడుం పట్టని లక్ష్యసాధనలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. తనపై విమర్శలకు దిగితే తగిన విధంగా బదులిస్తానన్నారు. ''విద్యార్థులతో సమావేశాలు పెడుతున్నారు. వాటికెళ్తే ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో వివరిస్తారు. నేరాలెలా చేయాలో చెబుతారు.. జైళ్ళనుంచి ఎలా బయటపడాలో కూడా శిక్షణిస్తారు. తల్లిదండ్రులూ మీరైనా అప్రమత్తంగా ఉండండి.. పిల్లల్ని ఇలాంటివాటికి దూరంగా ఉంచండి'' అంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టిన కేసులకుఎలాంటి విలువలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే ప్యాకేజీకి అంగీకరించానని చంద్రబాబు అన్నారు. మూడేళ్ళలో కేంద్రం పోలవరానికి 30వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. 4 దశాబ్దాలుగా ఒక్కడుగు ముందుకు జరగని ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం వస్తే దీన్ని చేజేతులా వదులుకోమంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా 26సార్లు కోర్టుకెళితే ప్రతిసారి మొట్టికాయలు తిని వెనక్కొచ్చారన్నారు.

దోమలపై దండ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెంచాలన్నారు. కేవలం ప్రభుత్వం, అధికారులు మాత్రమే ఇది సాధించలేరన్నారు. విద్యార్ధులు ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలన్నారు. ముఖ్యంగా దోమల వల్ల ఎదురయ్యే నష్టాల్ని వివరించాలన్నారు. తొమ్మిదిరకాల వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. పరిశుభ్రతతో ఈ రోగాల్నిదూరంగా ఉంచొచ్చన్నారు. కార్పొరేటర్‌, వార్డు సభ్యులతో సహా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో అవగాహన పెంచుకోవాలన్నారు. అమరావతి నుంచే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా రాష్ట్రమంతా పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలిస్తానన్నారు. అవసరమైతే 110పురపాలక సంఘాల్ని సందర్శిస్తానని బాబు హామీ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు