నాని ని ఢీకొడుతున్నాడు.. నిలుస్తాడా?

నాని ని ఢీకొడుతున్నాడు.. నిలుస్తాడా?

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలు చాలామందే ఉన్నారు. ఆ జాబితాలో చేరాలని చాలా ఏళ్ల పాటు ప్రయత్నించాడు తమిళ స్టార్ హీరో ధనుష్. అతడి ప్రయత్నం గత ఏడాది ఫలించింది. ‘వేల ఇల్ల పట్టదారి’ తెలుగు వెర్షన్ ‘రఘువరన్ బీటెక్’ పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సూపర్ హిట్టయింది. దీంతో ఆ తర్వాత ధనుష్ నటించిన పాత, కొత్త సినిమాలన్నింటినీ తెలుగులోకి తెచ్చేశారు. కానీ ఏది కూడా ఆడలేదు. ఇప్పుడు అతడి ఆశలు ‘రైల్’ మీదే ఉన్నాయి. తమిళంలో ‘తొడారి’ పేరుతో తెరకెక్కిన సినిమాకు తెలుగు వెర్షన్ ఇది. ధనుష్‌కు ‘వేల ఇల్ల పట్టదారి’ తర్వాత తమిళంలోనూ హిట్లు లేవు. ఈ నేపథ్యంలో ‘తొడారి’ మీద చాలా ఆశతో ఉన్నాడు. ఈ సినిమాతో అటు తమిళంలో.. ఇటు తెలుగులో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

తెలుగులోకి అనువాదమైన ప్రేమఖైదీ.. గజరాజు లాంటి సినిమాలు తీసిన ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన సినిమా ‘రైల్’. నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ ధనుష్‌కు జోడీగా నటించింది. మొత్తం రెండున్నర గంటల సినిమా దాదాపుగా రైల్లోనే నడుస్తుంది. గురువారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఐతే నాని సినిమా ‘మజ్ను’ మంచి అంచనాల మధ్య విడుదలవుతున్న నేపథ్యంలో దానికి పోటీగా విడుదలవుతున్న ‘రైల్’ ఏమాత్రం ఉనికిని చాటుకుంటుందన్నది సందేహం. ‘రైల్’కు పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు. ధనుష్ ఇటు వైపే చూడలేదు. కొన్ని వారాలుగా సరైన సినిమాలు లేని నేపథ్యంలో ‘రైల్’కు థియేటర్లయితే బాగానే దొరికాయి. మరి కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపిస్తున్న ‘రైల్’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు