'ఏపీనే మొండి వైఖరి అవలంబిస్తోంది'

'ఏపీనే మొండి వైఖరి అవలంబిస్తోంది'

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ సరైన సఖ్యతలేదు. తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలతో మంచి మైత్రి కొనసాగిస్తోంది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతోంది. మరోపక్క, ఏపీదీ దాదాపు ఇలాంటి వైఖరే. అనేక అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమయ్యాయి. సామరస్యంగా ఉంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, పట్టువిడుపులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఇదే విషయమై తెలంగాణ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తప్పంతా ఆంధ్రప్రదేశ్ నాయకత్వానిదే అని అన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే ఏపీతోనూ సఖ్యతగా ఉండాలనుకున్నా..ఏపీనే మొండి వైఖరి అవలంబిస్తోందని మంత్రి హరీష్‌రావు అంటున్నారు. తెలంగాణ వృద్ధిని, తాము నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టులను ఏపీ అడ్డుకుంటోందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. 2007, 2013లోనే పాలమూరు ప్రాజెక్ట్‌కు డీపీఆర్‌ ఇచ్చారని, అప్పటి నీటి కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఇరురాష్ట్రాల సమస్యలు అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చలతో సమసిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్‌ పాజిటివ్‌గా ముందుకు వెళ్తోందని అన్నారు. మంత్రిగారు చెప్పిందంతా బాగానే ఉన్నా.. ఈ విషయంలో ఏపీనే ఎండగట్టడం ఎంతమాత్రం సబబు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లన్న సంగతి ఆయనకు తెలియందేమీ కాదు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు