గోడ దూకిన టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఇంటికేనా?

గోడ దూకిన టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఇంటికేనా?

నిజమే... తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొద్దిసేపటి క్రితం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ అమలు చేస్తే... టీ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యేలపై అనరత వేటు పడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. గడచిన ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి టీ టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగగా, కేవలం 15 మంది మాత్రం విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో జనం టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపడంతో టీ టీడీపీకి అతికొద్ది సీట్లు మాత్రమే లభించాయి. అయితే కాలక్రమంలో టీఆర్‌ఎస్‌ తెర తీసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు టీ టీడీపీ విలవిల్లాడిపోయింది. విడతలవారీగా 12 మంది టీ టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటీకి చేరిపోయారు. దీంతో టీ టీడీపీ బలం 15 నుంచి 3కు పడిపోయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు... తమ పార్టీని టీఆర్‌ఎస్‌ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ కు ఓ వినతిపత్రం సమర్పించారు. దీనికి స్పీకర్‌ సానుకూలంగా స్పందిస్తే... తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీపీ మనుగడ గల్లంతు ఖాయమే. అయితే దీనిపై స్పీకర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఈ క్రమంలో ఉన్న బలమంతా గాలికి కొట్టుకుపోయినా... మొక్కవోని ధైర్యంతో పోరు సాగిస్తున్న టీ టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనరత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై కొద్దిసేపటి క్రితం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై  చర్యల విషయంలో మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు... టీ టీడీపీని టీఆర్‌ఎస్‌ లో విలీనం చేస్తున్నట్లు ఇచ్చిన వినతిపైనా మూడు నెల్లలోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే... గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు