ప్రధాని వీధి పేరు 'ఏకాత్మ మార్గ్‌'

ప్రధాని వీధి పేరు 'ఏకాత్మ మార్గ్‌'

భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసముండే 7, రేస్‌ రేస్‌ కోర్స్‌ రోడ్‌ పేరు 'ఏకాత్మ మార్గ్‌'గా మారిపోనుందని వార్తలొస్తున్నాయి. పేరు మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. బీజేపీ నేత మీనాక్షి లేఖి ఈ అంశంపై ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రధాని ఉండే రోడ్‌ నేమ్‌ ఛేంజ్‌ అయిపోతుందని అంతా భావిస్తున్నారు. 7, రేస్‌ రేస్‌ కోర్స్‌ రోడ్‌ భారత సంస్కృతిని ప్రతిబింబించడం లేదని, ప్రధాని నివాసముండే ఇలాంటి ప్రాంతానికి భారతీయత ఉట్టిపడే పేరు పెట్టాలని మీనాక్షి లేఖి లేఖలో పేర్కొన్నారు. 'ఏకాత్మ మార్గ్‌' అని పేరు పెడితే బాగుంటుందనీ సూచించారు. ఈ పేరు కమలనాథులకు నచ్చేసింది. ఈ ప్రపోజల్‌కు అంతా ఓకే చెప్పేస్తే 7, రేస్‌ రేస్‌ కోర్స్‌ రోడ్‌ 'ఏకాత్మ మార్గ్‌'గా మారిపోతుంది.

ప్రధాని నివాసముండే రోడ్‌ను 'ఏకాత్మ మార్గ్‌'గా మార్చడం పార్టీ ఐకన్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయకు ఘన నివాళులర్పించినట్టేనని మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. దీన్‌ దయాళ్‌ సమగ్ర మానవతావాదాన్ని ప్రతిబింబించే 'ఏకాత్మ మానవ్‌' స్పూర్తిగానే 'ఏకాత్మ మార్గ్‌'ను ప్రతిపాదించినట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలో గతంలోనూ కొన్ని రోడ్స్‌ పేర్లు మార్చారు. ఔరంగాజేబ్‌ రోడ్‌కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రోడ్‌గా నామకరణం చేశారు. చరిత్రతో సంబంధం ఉన్న ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తమయినా బీజేపీ వెనక్కితగ్గలేదు.

అక్బర్‌ రోడ్‌కు మహారాణా ప్రతాప్‌ మార్గ్‌గా పేరు పెట్టాలనీ ఓ డిమాండ్‌ ఉంది. అయితే దీనిపై బీజేపీ మౌనం పాటిస్తోంది. గుర్గావ్‌ను గురుగ్రామ్‌గా మార్చాలన్న ప్రభుత్వ యత్నానికి ఆదిలోనే బ్రేక్‌ పడింది. మరి 7, రేస్‌ రేస్‌ కోర్స్‌ రోడ్‌ నిజంగానే 'ఏకాత్మ మార్గ్‌'గా మారిపోతుందా? లేదా? అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు