జనసేనకు 18 శాతం ఓట్లొచ్చాయట

జనసేన అధినేత పవన్ కల్యాన్ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమిటంటే మొదటి దశ పంచాయితి ఎన్నికల్లో జనసేనకు 18 శాతం ఓట్లొచ్చినట్లు. తొలిదశ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జనసేన మద్దతుతో పోటీచేసిన వారు 18 శాతం ఓట్లు సాధించిన విషయం స్పష్టమైందన్నారు.

తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు వెయ్యికిపైగా వార్డులో గెలిచారట. అలాగే 1700 పంచాయితీల్లో రెండోస్ధానంలో నిలిచినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. తమ మద్దతుతో పోటీచేసిన వారు గెలవటం, రెండోస్ధానంలో నిలవటమంటే జనాల్లో మార్పు మొదలైందనేందుకు నిదర్శనమట. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందన్న చంద్రబాబునాయుడు వాదననే పవన్ కూడా వినిపించటం విశేషం.

పవన్ చేసిన ప్రకటనలో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలీదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిత్రపక్షం బీజేపీ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. పోటీచేసిందేమో రెండుపార్టీలు కలిసే పోటీ చేశాయి. కానీ చెప్పిన లెక్కలు మాత్రం తమ పార్టీకి సంబంధించి మాత్రమే. మరి బీజేపీ ఖాతాలో పడిన వార్డులు, పంచాయితీల లెక్కలు ఎందుకు చెప్పలేదు ?