మంజునాథ్‌ కమిటీ వెనక రియల్‌ స్టోరీ ఇదా

మంజునాథ్‌ కమిటీ వెనక రియల్‌ స్టోరీ ఇదా

ఏపీలో ఇప్పటికీ చాపకింద నీరులా ప్రవహిస్తున్న కాపు రిజర్వేషన్‌ అంశంపై చంద్రబాబు జస్టిస్‌ మంజునాథ్‌ నేతృత్వంలో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఈక్రమంలోనే ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళన, రైలు దహనం వంటివి జరిగాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం జస్టిస్‌ మంజునాథ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే అప్పటి నుంచి ఒకింత ఇనాక్టివ్‌గా ఉన్న ఈ కమిటీ ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్‌గా మారిపోయింది.

దీంతోఈ కమిటీ ఇంతగా యాక్టివ్‌ కావడానికి కారణాలేమై ఉంటాయాని కొందరు దృష్టి పెట్టారు. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న ముద్రగడ మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఆయన గతంలో కన్నా ఎక్కువగా మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలోనే సినీ ఫీల్డ్‌లోని తన కాపు సామాజిక వర్గాన్ని ఆయన కలిసి.. సమస్య వివరించారు. దీంతో దాసరి నారాయణరావు, చిరంజీవి వంటి వారు ముద్రగడకు మద్దతిస్తున్నారు. దీంతో రేపో మాపో ముద్రగడ మళ్లీ ఉద్యమిస్తే.. ఈ సారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుకు ఇంటిలిజెన్స్‌ నుంచి సమాచారం అందిందట. దీంతో ఆయన కాపు ఉద్యమాన్ని ఎంత మేరకు ఎదుర్కొనగలిగే అవకాశం ఉంటే అంతవరకు ఎదుర్కొనేలా పక్కాప్లాన్‌తో రెడీ అయిపోయారట.

ఈ క్రమంలోనే మంజు నాథ్‌ కమిటీ.. జిల్లాల్లో పర్యటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఒక వేళ ముద్రగడ తిరిగి ఉద్యమం స్టార్ట్‌ చేసినా.. తాము కాపులకు ఏమీ అన్యాయం చేయడం లేదని, మంజునాథ్‌ కమిటీ ఇప్పుడు జిల్లాల్లో పర్యటన సాగిస్తోందని అది నివేదిక ఇచ్చాక పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ఎదురు దాడి చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటోందన్నమాట.

ముద్రగడ పద్మనాభం రాజకీయ దురుదేశ్యంతోనే ఉద్యమాలు చేస్తున్నారని, ముద్రగడకి కాపులకి రిజర్వేషన్లు సాధించాలనే తపన కంటే, వైకాపాకి అనుకూలంగా దాని ప్రోత్సాహంతో రాజకీయాలు చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని రివర్స్‌లో ఏకేసేందుకు అధికార పక్షం పెద్ద స్కెచ్‌నే సిద్ధం చేసిందని సమాచారం. ఇక, ఇప్పటికే కాపు విద్యార్థులకు కల్పిస్తున్న విదేశీ విద్యా ఛాన్స్‌లను కూడా ప్రభుత్వం ఫోకస్‌ చేయాలని భావించింది. దీంతో ముద్రగడకు ఛాన్స్‌ ఇవ్వకుండా చేయాలని ప్రభుత్వం సర్వం సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు