హోదా కోసం ప్రజా బ్యాలెట్‌

హోదా కోసం ప్రజా బ్యాలెట్‌

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పునర్‌ వైభవం తెచ్చేందుకు అతడే ఒక సైన్యం మాదిరిగా పోరాటం చేస్తున్న పీసీసీ  అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ఈ క్రమంలో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తమ ఆలోచన వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలో వద్దో నిర్ణయించేందుకు ఈ నెల 28న తిరుపతిలో ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రఘువీరారెడ్డి ప్రకటించారు. ప్రజా బ్యాలెట్‌ ఫలితాల్లో ప్రత్యేక హోదా వద్దని మెజారిటీ ప్రజలు తీర్పు ఇస్తే సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడిని తామే సన్మానిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దోచుకోవడానికే ఈ నకిలీ ప్యాకేజీకి అంగీకరించారన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, పరిశ్రమల్లో ఈ బ్యాలెట్‌ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ సందర్భంగా రఘవీరా ప్రజా బ్యాలెట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో  టీడీపీ, బీజేపీలకు 2019లో నాలుగైదు పార్లమెంట్‌ స్థానాలకు మించి రావని రఘువీరా జోస్యం చెప్పారు. ఈ నెల 28న నిర్వహించే ప్రజాబ్యాలెట్‌ ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రత్యేకహోదా, కాపు ఉద్యమం రిజర్వేషన్‌ అంశాలపై ప్రజల్లో ఏ మేరకు సంతృప్తి ఉందో రెండు రంగుల బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తామని వెల్లడిస్తామని రఘువీరా తెలిపారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీకి, పవన్‌ జనసేన పార్టీలకు హోదా కోసం పోరాడే సత్తా ఉంది కానీ.. ప్రత్యేకహోదా తెచ్చే సత్తా మాత్రం కాంగ్రెస్‌కే ఉందన్నారు.

కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్‌ కల్పించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని రఘువీరా చెప్పారు. కాపు రిజర్వేషన్ల విషయంలో బాబు సర్కారు తీరు కక్షపూరితంగా ఉందని రఘువీరా మండిపడ్డారు. శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్యపై ఐదు, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజుపై ఏడు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా రిజర్వేషన్‌ అంశంపై సాగదీత ధోరణి అవలంభిస్తున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజునాధ కమిషన్‌తో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదానికి కారగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు