అప్పుడే విడిపోయుంటే బాగుండేది: నాయుడు

అప్పుడే విడిపోయుంటే బాగుండేది: నాయుడు

ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీలిచ్చిన కేంద్ర ప్రభుత్వంపై ఏపీ మండిపడుతోంది. ప్రభుత్వంతో పాటూ విపక్షాలూ బీజేపీని దులిపేస్తున్నాయి. రాష్ట్రంలో వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో హోదా పరిమితులపై ప్రజలకు వివరించేందుకు కమలనాథులు కొద్దికాలంగా యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నాగాలాండ్, మిజోరాం, అసోం, సిక్కిం, పర్వత సానువుల్లోని హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారని ఏపీకి అలాంటి పరిస్థితి లేదని చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ లో కోరానని వెంకయ్య గుర్తుచేశారు. అయితే, 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసిందని అన్నారు. విభజన చట్టంలోనే హోదా అంశం చేర్చి ఉంటే రాష్ట్రానికి ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేదికాదని అన్నారు.  పరోక్షంగా ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరిని వెంకయ్య ఎండగట్టారు. విభజన కారణంగా ఆంధ్రకు కలిగిన నష్టాన్ని పూడ్చాలని కోరింది తానేనని మరోసారి గుర్తుచేశారు.

ప్యాకేజీల విషయంలో తమను టార్గెట్ చేయడం అర్ధరహితమన్న వెంకయ్య తెలుగు నేలను 1972లోనే విభజించి ఉంటే బాగుండేదని అన్నారు. అప్పుడే రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారిపోయి ఉండేదని, గణనీయమైన అభివృద్ధి సాధించేదని పేర్కొన్నారు. హోదాకు మించిన లాభాలు ప్యాకేజీల ద్వారా ఉన్నాయన్న వాదనను సమర్థించుకున్నారు వెంకయ్య. ఎలాంటి పరిస్థితిలో హోదా ఇవ్వలేకపోయారో చెప్తూనే ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఏపీకి కలిగే లాభాలను వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు