వెంకయ్యా.. విలువలేవయ్యా?

వెంకయ్యా.. విలువలేవయ్యా?

ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలనే సామెత ఏపీ నుంచి కేంద్రంలో చక్రం తిప్పుతున్న వెంకయ్యనాయుడుకి అక్షరాలా సరిపోతుంది. విపక్షంలో ఉన్నప్పుడు ఆయన పొలిటికల్‌గా ఎన్నో నీతులు వల్లించేవారు. అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి.. ఆ నీతులు, విలువలను పెట్లో పెట్టి తాళం వేసినట్టుగా కనిపిస్తోంది. విపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభ సాక్షిగా.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ నానా యాగీ చేశారు వెంకయ్య. దీంతో ఐదేళ్లు ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌ ప్రకటించారు. అయితే, ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలని పట్టుబట్టారు వెంకయ్య. తాము అధికారంలోకి వస్తే .. ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరతామని ప్రకటించారు.

తీరా అధికారం వచ్చాక.. ఈ మాటను అటకెక్కించేశారు. హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అంటూ కొత్త రాగం అందుకున్నారు. హోదాతో ఏమొస్తుంది.. ప్యాకేజీ అయితే, ఏపీలో స్వర్గం సాక్షాత్కారం అవుతుంది అంటూ మాటల కోటలు దాటించేస్తున్నారు. అదే సమయంలో తాను లేకపోతే ఏపీకి ప్యాకేజీ కూడా వచ్చే పరిస్థితి లేదని బిల్డప్‌ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు విభజన పాపం అంతా కాంగ్రెస్‌దేనని విమర్శించేస్తున్నారు. పార్లమెంటు తలుపులు మూసి విభజన చేశారని అన్నారు. కానీ, అంతకు ముందే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన మరిచిపోవడం విశేషం.

ఇక, ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాజా అక్కడి కాంగ్రెస్‌ సీఎం సహా 42 మంది ఎమ్మెల్యేలను తన పంచన చేరేలా చక్రం తిప్పింది. ప్రజలు ఎన్నుకుని, అధికారం కట్టబెట్టిన కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసింది. దీనిని కూడా వెంకయ్య నిస్సంకోచంగా సమర్ధించుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ కు మంచి రోజు, కాంగ్రెస్‌ కు చెడ్డ రోజు అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వంపై నమ్మకం లేకే ముఖ్యమంత్రి తో సహా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ పార్టీని వదలివేశారని ఆయన అన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ నేతలంతా ఆ పార్టీని వీడిపోతున్నారని, ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. నాయకత్వంపై విశ్వాసం సడలిపోయిందని ,అందువల్లనే ముఖ్యమంత్రి తో సహా అంతా ప్రాంతీయ పార్టీలో చేరారని అన్నారు.అయితే, విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్‌ విషయంలో ఇలానే మాట్లాడారా వెంకయ్యా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా.. అధికారంలోకి వచ్చాక మరోలాగా..మాట్లాడడం వెంకయ్యకే చెల్లిందని అంటున్నారు. ఏదేమైనా చెప్పే విలువలు చేతల్లే చూపని నేతల జాబితాలో వెంకయ్య కూడా చేరిపోయారనే అనుకోవాల్సి వస్తోంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు