'నేనేమీ బాలయ్యలా తుపాకీ వాడడం లేదు'

'నేనేమీ బాలయ్యలా తుపాకీ వాడడం లేదు'

సీఎం చంద్రబాబుకు వియ్యంకుడు కమ్ బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను అప్పుడెప్పుడో తుపాకీ కాల్పుల ఘటన ఇంకా విడిచిపెట్టడం లేదు. నిజానికి కేసును కామప్ చేసేసి మొన్నటిమొన్న పూర్తిగా ఆ ఫైలునే క్లోజ్ చేసేసినా కూడా విమర్శకుల వద్ద మాత్రం బాలయ్య కేసు క్లోజ్ కాలేదు. సొంత బావే ముఖ్యమంత్రి కావడంతో కేసు పైలును మూసేసినా జనం నోటిని మాత్రం మూయలేకపోతున్నారు. సందర్భం వచ్చినప్పుడంతా ప్రతి ఒక్కరూ బాలయ్యలా మేం కాల్చలేదని అంటున్నారు. తాజాగా సీఎం చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా బాలయ్యపై తుపాకీ లాంటి విమర్శలను గురిపెట్టారు. తుపాకీ సరెండర్ వ్యవహారంలో మాట్లాడిన ఆయన ''నేనేమీ బాలయ్యలా తుపాకీ వాడడం లేదు" అంటూ మానిపోయిన గాయాన్ని మళ్లీ రేపారు.

తన వియ్యంకుడి రివాల్వర్‌ను సరెండర్‌ చేయమంటూ ప్రభుత్వం ఆదేశించడంపై ముద్రగడ మండిపడ్డారు. తానేమీ ముఖ్యమంత్రి బావమరిది బాలకృష్ణ తరహాలో వియ్యంకుడి తుపాకీని ఉపయోగించేదిలేదన్నారు. బాలకృష్ణ తన భార్య పేరిటున్న రివాల్వర్‌ను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తనపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని ముద్రగడ ఆరోపించారు. అలాంటి వేధింపులకు తాను భయపడే రకం కాదని.. తన ఉద్యమానికి, తన వియ్యంకుడి రివాల్వర్‌కు సంబంధమేంటంటూ ఆయన ప్రశ్నించారు. రాజమండ్రిలో సమావేశానికి ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందన్నారు. తునిలో సభకుస్థలమిచ్చిన మిత్రుడిపై కేసులు పెట్టారన్నారు. తమ విషయంలో ప్రభుత్వం మానవహక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఈ విధానాల్ని వీడని పక్షంలో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. తాను మాత్రం ఇలాంటి ఉడత అరుపులకు భయపడి ఉద్యమాన్ని నిలిపేసే ప్రసక్తేలేదన్నారు.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English