సీఎం కేసీఆర్‌ అండ్‌ కోకు ఏపీ కోర్టు నోటీసులు

సీఎం కేసీఆర్‌ అండ్‌ కోకు ఏపీ కోర్టు నోటీసులు

తెలంగాణ వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయినా.. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్‌ సహా టీఆర్‌ ఎస్‌ నేతలను అప్పటి కేసులు పట్టిపీడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వివిధ రూపాల్లో ఉద్యమించిన నేతలు ఆంధ్రులపై విచ్చలవిడిగా విరుచుకుపడ్డారు. ఆంధ్రావాళ్లు దొంగలని, తెలంగాణను దోచుకుంటున్నారని అప్పట్లో కేసీఆర్‌ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రోజూ ఏదో ఒక రకంగా ఆంధ్రాపార్టీలను, ఆంధ్రా నేతలను టార్గెట్‌ చేసిన కేసీఆర్‌ తదితరులు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అప్పట్లోనే ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన వేజెండ్ల సుబ్బారావు ఆంధ్రుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటూ ప్రకాశం జిల్లా అద్దంకి స్థానిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆంధ్రులను కించపరిచేలా టీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్‌, నాయిని నరసింహారెడ్డి, కల్వకుంట్ల కవిత, తన్నీరు హరీష్‌రావు సహా అప్పటి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏకే ఖాన్‌లపై చర్యలు తీసుకోవాలని సుబ్బారావు తన పిటిషన్‌లో అభ్యర్థించారు. అయితే, ఆ కోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో సుబ్బారావు.. జిల్లా కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేసీఆర్‌ సహా ఆయా నేతలు, ఏకేఖాన్‌లను అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు  7వ అదనపు జిల్లా జడ్జి నోటీసులు జారీ చేసినట్లు సుబ్బారావే మీడియాకు తెలిపారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఆంధ్ర ప్రజలను, దివంగత నాయకులను, రాష్ట్రాన్ని కేసీఆర్‌ అండ్‌ కో కించపరిచారని పేర్కొన్నారు. మరి దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో....!  విభజన తర్వాత కూడా ఆంధ్రోళ్లు తమను పట్టి పీడిస్తున్నారని  కామెంట్లు చేస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు