దేవినేని చేరిక...ఆముగ్గురు ఎమ్మెల్యేల నిరసన?

దేవినేని చేరిక...ఆముగ్గురు ఎమ్మెల్యేల నిరసన?

మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌ (దేవినేని నెహ్రూ) తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరటంతో ముందు ఊహించినట్లుగానే టీడీపీలో నిరసనలు మొదలవుతున్నాయి. గుణదల బిషప్‌ గ్రాసి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు దేవినేని అవినాష్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు వారి అనుచరగణానికి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి పార్టీకి ఎమ్మెల్యేలు బొండా ఉమ, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డుమ్మాకొట్టారు. వీరు ముగ్గురూ గైరాజరు కావటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నెహ్రూ తిరిగి సొంత గూటికి చేరుకోవటంతో భవిష్యత్‌లో ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేదా వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారానే అనే మాటను కూడా కొందరు వ్యక్తపర్చడం గమనారం.

ఇదిలాఉండగా టీడీపీలో చేరిన సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు కవచంలాగా ఉంటామని హామీ ఇచ్చారు. 5కోట్ల ప్రజల ఊపిరి, శ్వాస చంద్రబాబునాయుడును పొగిడేశారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో తన ఊపిరి, శ్వాస ప్రజలే కాబట్టి వారి ముందు ఉండి మాట్లాగలుగుతున్నానని చెప్పారు.  తెలుగుదేశం ఆవిర్భావానికి ముందునుంచి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశానని నెహ్రూ తెలిపారు. ఎన్‌టీరామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి నాలుగు సార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందానని, ఆనాడు ఎన్‌టీఆర్‌ తను మంత్రిగా తీసుకున్నప్పుడు చంద్రబాబునాయుడు సహకరించారని నెహ్రూ గుర్తుచేశారు. అప్పుడే తాను టీడీపీ జెండా కప్పుకునే చనిపోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అయితే అనుకోని పరిస్థితుల్లో టీడీపీని వదిలి కాంగ్రెస్‌లోకి కంట తడితోనే వెళ్లానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో 16 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకుంటామని నెహ్రూ భరోసా వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ ప్రారంభించినప్పుడు తాను చంద్రబాబు చర్యలను తప్పుపట్టానని, సంవత్సరంలోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే, ఆయనను ఘనంగా సన్మానిస్తానని ఆనాడు చెప్పానని అదే ఇప్పుడు నిజమైందనుకుంటున్నానని నెహ్రూ అన్నారు.  ఆయన తనయుడు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రతి అడుగులో అడుగువేస్తామని చెప్పారు. రాబోయే 30ఏళ్లలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు