బాబు ఫైర్‌: వైసీపీ తోక కట్‌ చేస్తా

బాబు ఫైర్‌: వైసీపీ తోక కట్‌ చేస్తా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీపై మరోమారు మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, అతని కుమారుడు అవినాష్‌, కడియాల బుచ్చిబాబు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ప్రతిపక్ష పార్టీ వారు ఉన్మాదులుగా తయారయ్యారని అన్నారు. వైకాపాకు సరైన నాయకత్వం లేదని, అందుకే ఆపార్టీ వారంతా ఉన్మాదులుగా తయారవుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్తంభింప చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంచీలెక్కి గందరగోళం సృష్టించారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానన్న భరోసాతో ప్రజలు తనకు పట్టం కట్టారని, ఎవరైనా అభివృద్ధికి అడ్డుతగిలితే తోక కట్‌ చేస్తానని హెచ్చరించారు.

రాజధాని నిర్మాణంలో 56 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు అన్నారు. 'నా రాజకీయ అనుభవం అంత లేదు ప్రతిపక్ష నాయకుడి వయసు' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నా కుటుంబం, ప్రజలు నా కుటుంబ సభ్యులు. వారికి ఏ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది' అని అన్నారు. కాకినాడలో దివీస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వైకాపా అడ్డుపడుతోందని, కానీ వారి ఆటలు సాగనీయనని, తోక కట్‌ చేస్తానని చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు రావల్సినవన్నీ రాబట్టడానికి తాను నిరంతరం కేంద్రంతో పోరాడుతునే ఉంటానని చంద్రబాబు అన్నారు. హోదాకు బదులు దానికి సరిసమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, అన్నీ తెలిసిన వ్యక్తిగా తాను అందుకు అంగీకరించాల్సి వచ్చిందని చెప్పారు. ఏపీకి రావల్సిన ప్రతి పైసా రాబడతానని, తనది ఉడుంపట్టు అని అన్నారు.

'సాంకేతిక కారణాల వల్లే కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలనలో ఉంచింది. దీన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు బ్లాక్‌మెయిల్‌ చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈవిషయంలో తాను వెనక్కుతగ్గేది లేదు' అని చంద్రబాబు స్పష్టం చేశారు. హోదాకు తగిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ముందుకొస్తే దాన్ని అడ్డుకోవటం ప్రజలను వంచించటమేనని బాబు అన్నారు. రిజర్వుబ్యాంక్‌ నివేదిక ప్రకారం 2015-16 సంవత్సరానికి 905 బిలియన్‌ కోట్ల పెట్టుబడులు వస్తే అందులో రాష్ట్రానికి 15.8 శాతం ఉన్నాయని వివరించారు. గుజరాత్‌కు 14.5, మహారాష్ట్ర 10.9, తమిళనాడు 9 శాతం వచ్చినట్లు తెలిపారు. ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో కేంద్రంతో తగవు పెట్టుకుంటే ఏదీ సాధ్యపడదని, ఒత్తిడి తెచ్చి అన్నీ సాధించుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. అలిపిరిలో తనపై దాడి జరిగినప్పుడు తిరుమల వెంకటేశ్వరుడే తనను కాపాడాడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 24 క్లెమోర్‌ మైన్స్‌ పెట్టి తనను హతమార్చాలనుకున్నారని, దేవుడి దయవలన తప్పించుకుననాన్నిన ఆయన చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు