బాబు ఊస్టింగ్‌ మంత్రులు వీరేనట

బాబు ఊస్టింగ్‌ మంత్రులు వీరేనట

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయనేది ఖాయంగా తెలుస్తోంది. వచ్చే దసరా నాటికి మంత్రి మండలిని పునర్‌ వ్యవస్థీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు చేశారని సమాచారం. ప్రస్తుత కేబినెట్‌ నుంచి కొందరికి ఉద్వాసన, కొత్త వారికి అవకాశాలతో మంత్రుల సంఖ్య ఇప్పటి 19 నుంచి 26కు పెంచుతారని భావిస్తున్నారు. అయితే పెంచే ఏడుగురు కొత్తవారేనా?  పాతవారికి ఉద్వాసన ఇస్తే వారెవరు అనే చర్చ మొదలవుతోంది?  విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఆ ఏడుగురి పేర్లు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం.

రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు కొన్నాళ్లుగా సందర్భోచితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పనితీరు, నైపుణ్యం మెరుగు పరుచుకోవాలని సూచిస్తున్నారు. అయినా మార్పులేని ఏడుగురు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని సమాచారం. వారి స్థానంలో తిరిగి అవే సామాజిక వర్గాలకు చెందిన వారికి అవకాశమివ్వగలరనుకుంటున్నారు. చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఐటి, మరోకీలకమైన శాఖనూ అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ ఐటి మంత్రిగా ఉన్న పల్లె రఘునాథరెడ్డికి మరోశాఖ కేటాయిస్తారా? తొలగిస్తారా? అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

వ్యవసాయ శాఖమంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావును తొలగించి, ఆ స్థానంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. గుంటూరు జిల్లా నుంచే సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖమంత్రిగా ఉన్న రావెల కిషోర్‌బాబు స్థానంలో, అదే జిల్లాకు చెందిన వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబుకు అవకాశం కల్పించనున్నారు. ఎస్సీ కోటాలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి ఎక్పైజ్‌, బీసీ సంక్షేమ శాఖమంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర స్థానంలో, కృష్ణా జిల్లాకే చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌కు మంత్రిపదవి ఇవ్వనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పీతల సుజాతను తొలగిస్తారని తెలుస్తోంది. వైసిపి నుంచి టిడిపిలోకి చేరిన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంత్రిపదవి ఇవ్వనున్నారు. కాపు రిజర్వేషన్ల అంశం దృష్ట్యా జ్యోతుల నెహ్రూకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ముద్రగడకు చెక్‌ పెట్టే వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని సమాచారం. నెల్లూరు జిల్లా నుంచి మున్సిపల్‌ శాఖమంత్రిగా ఉన్న పి నారాయణను మంత్రిపదవి నుంచి తొలగించి వేరేదైనా పదవి ఇస్తారని, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఆ జిల్లా నుంచి మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారని అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావును తొలగించి అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని సమాచారం. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ ఇద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పిసారంటున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీలోకి చేరిన బొబ్బిలి వైసిపి ఎమ్మెల్యే సుజయకృష్ణకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖమంత్రిగా కొనసాగుతున్న కిమిడి మృణాళిని తొలగించి ఆ స్థానంలో అదే కుటుంబానికి చెందిన, ప్రస్తుతం పార్టీ ఏపి శాఖ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావును కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. కడప జిల్లా నుంచి ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న సతీష్‌రెడ్డికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. మైనార్టీ కోటాలో ఇప్పటివరకు మంత్రిపదవి ఎవరికి ఇవ్వలేదు. ఈ కోటాలో అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్‌కు అవకాశం కల్పించనున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రులు చినరాజప్ప, కెఇ కృష్ణమూర్తిల శాఖల మార్చే అంశం గురించి యోచిస్తున్నారని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు