ప్రవచనాలకు చాగంటి ఎంత పుచ్చుకుంటారు?

ప్రవచనాలకు చాగంటి ఎంత పుచ్చుకుంటారు?

తెలుగునాట ప్రవచనం అనే మాటెత్తగానే చాగంటి కోటేశ్వరరావు గుర్తుకొస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ తన ప్రవచనాలతో మంత్రముగ్ధుల్ని చేస్తారాయన. యూత్‌ సైతం ఆయన ప్రవచనాలకు ఆకర్షితులవుతారు. ఆయన మాటల్ని పాటిస్తారు. అంతగా ఆయన ప్రవచనాలు ప్రభావం చూపిస్తాయి. ఐతే ఈ ప్రవచనాలు చెప్పడానికి.. తాను హాజరయ్యే కార్యక్రమాలకు చాగంటి ఏమైనా డబ్బులు పుచ్చుకుంటారా అన్న సందేహాలు జనాల్లో కలగడం సహజం. అలాగే చాగంటి అంటే గిట్టని వారు.. ఆయన కోట్లు సంపాదించారని ప్రచారం కూడా చేస్తుంటారు. ఇలాంటి సందేహాలకు స్వయంగా ఓ కార్యక్రమంలో సమాధానాలిచ్చారు చాగంటి. ఇంతకీ ఆయనేమన్నారంటే..

''నేను ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి చాలామందికి తెలియదు. భారత ఆహార సంస్థలో పనిచేస్తాను. నాకింకా 2018 వరకు సర్వీస్‌ ఉంది. మా ఆవిడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. మా అబ్బాయి టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తాడు. మా అమ్మాయికి పెళ్లయి విదేశాల్లోనే స్థిరపడింది. అల్లుడు యోగ్యుడు. ఇక నాకు ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. అందుకే ప్రవచనాలు చెప్పడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఇదంతా సమాజానికి ఏదో మంచి చేద్దామని చేసే ప్రయత్నం తప్ప మరేమీ లేదు. నా మాటల వల్ల ఎందరో కొందరిలో మార్పు వస్తుందని ఆశ. ప్రయాణ ఛార్జీలు సైతం నేనే పెట్టుకుని కార్యక్రమాలకు వెళ్తా. కొన్నిసార్లు ఆఫీస్‌కు సెలవు పెట్టి.. జీతం వదులుకుని కార్యక్రమాలకు వెళ్తుంటా. అందులో నాకు సంతోషం ఉంది. నేను కోట్ల ఆస్తులు సంపాదించాను అనేవారు అవేవో చూపిస్తే సంతోషిస్తా. నేను నిజంగా ఎవరి దగ్గరయినా డబ్బులు తీసుకునేట్లయితే.. ఈ మాట చెప్పలేను. డబ్బులు తీసుకుని కూడా ఇలా చెబితే డబ్బులిచ్చినవాళ్లు ఇలా అబద్ధమాడావేంటి అని నన్ను తిట్టక మానరు. నేను ప్రవచనాలు చెప్పే తొలి రోజుల్లోనే మా అమ్మ చనిపోతూ ఇలాంటి పనులకు డబ్బులు ఆశించొద్దని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నా'' అని చాగంటి చెప్పారు.

Also Read:
బాబును పొగిడాడు...వేదికమీదే పదవి కొట్టేశాడు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English