మంచి సినిమానే.. డబ్బులు తెస్తుందా?

మంచి సినిమానే.. డబ్బులు తెస్తుందా?

కొన్నిసార్లు సినిమాకు మంచి పేరొచ్చినా డబ్బులు రావు. ఇంకొన్ని సినిమాల మీద ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదు. నెల కిందట వచ్చిన ‘మనమంతా’ మొదటి కోవకు చెందిన సినిమానే. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మంచి రివ్యూలొచ్చాయి. చూసిన ప్రేక్షకులందరూ కూడా గొప్ప సినిమా అన్నారు. తీరా చూస్తే ఆ సినిమా ఆడలేదు. డబ్బులు తేలేదు. మంచి సినిమా తీసిన సాయి కొర్రపాటి నష్టాల పాలయ్యాడు. ఇప్పుడు ఆయన బేనర్లోనే ‘జ్యో అచ్యుతానంద’ సినిమా తెరకెక్కింది. నిన్నే విడుదలైన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. గొప్ప సినిమా అంటూ అందరూ దాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.

ఐతే గొప్ప సినిమా అనగానే సాయి కొర్రపాటికి గుబులు రేగుతుండొచ్చు. ఈ రోజుల్లో మంచి సినిమా అని.. గొప్ప సినిమా అని పేరు తెచ్చుకుంటే కష్టం. ఇదేదో సందేశాత్మక సినిమా అనో.. సెంటిమెంటు సినిమానో అనుకుని జనాలు థియేటర్లకు రారేమో అన్న భయం. సినిమా అంటే వినోదం కోసమే అనుకునే ప్రేక్షకులే ఎక్కువమంది అయిపోయారిప్పుడు. అందులోనూ ఏడాది రెండేళ్ల ముందు వరకు ఎంటర్టైనర్ల రాజ్యమే నడిచింది. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారుతోంది. వైవిధ్యమైన.. ఎమోషనల్ స్టోరీల్ని కూడా ఆదరిస్తున్నారు. ఐతే చిన్న సినిమాల విషయంలో మాత్రం అప్పుడప్పుడూ తేడా కొట్టేస్తోంది. ‘మనమంతా’ అలాగే దెబ్బ తింది. అందులో పేరున్న తెలుగు నటీనటులు లేకపోవడం సమస్యగా మారింది. ఐతే ‘జ్యో అచ్యుతానంద’కు ఆ ఇబ్బంది లేదు. అందరూ మనవాళ్లే. మంచి పేరున్న వాళ్లే. ఐతే బి, సి సెంటర్లలో మాత్రం ఈ సినిమాకు ఆదరణ దక్కే అవకాశాలు లేవు. ‘ఎ’ సెంటర్లలో ఎలా ఆడుతుంది.. ఎంత రాబడుతుంది అన్నది ఆకసక్తికరం. ఐతే నిర్మాత సేఫ్ అవడానికి అవకాశాలున్నాయి కానీ.. లాభాలు ఏమేరకు వస్తాయన్నదే చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు